Share News

నాలుగో టీ20లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు..

ABN , Publish Date - Mar 22 , 2026 | 02:50 PM

వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

నాలుగో టీ20లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు..
New Zealand Women vs South Africa Women

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్ మహిళల జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే కిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి159 పరుగులు చేసింది.


సౌతాఫ్రికా ఆల్ రౌండర్ అనేరీ డెర్క్సెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో ఆకట్టుకుంది. ఇక కివీస్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. డివైన్‌తో పాటు అమీలియా కేర్ 29 బంతుల్లో 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు సాధించింది. అన్నేరీ డెర్క్సెన్, మ్లబా చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జెస్ కెర్ అందుకుంది.


ఇవి కూడా చదవండి:

నాలుగో టీ20లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు..

ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కామెంట్స్... కౌంటర్ ఇచ్చిన గావస్కర్

Updated Date - Mar 22 , 2026 | 03:15 PM