Share News

ఐపీఎల్ 2026: ఢిల్లీ జట్టులోకి పునరాగమనం.. భావోద్వేగానికి గురైన పృథ్వీ షా

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:08 PM

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షా భావోద్వేగానికి గురయ్యాడు.

ఐపీఎల్ 2026: ఢిల్లీ జట్టులోకి పునరాగమనం.. భావోద్వేగానికి గురైన పృథ్వీ షా
Prithvi Shaw

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాను 2025 సీజన్ వేలానికి ముందు ఆ ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఆ తర్వాత ఇతర ఫ్రాంచైజీలేవీ అతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అతడి కెరీర్‌లో అనిశ్చితి నెలకొంది. ఫామ్ లేమితో ఇబ్బందులు పడి ఐపీఎల్‌కు దూరమైన పృథ్వీ షాను ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరాడు.ఈ సందర్బంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడాడు.


‘కొట్లా(ఇప్పుడు అరుణ్ జైట్లీ) మైదానం.. ఆ శబ్దం, నిశ్శబ్దం.. అక్కడ ఆడిన ఏ మ్యాచ్‌ను నేను మరువలేను. ఇది నన్ను ఓ గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దిన స్టేడియం. కొన్ని కథలకు ముగింపు అంటూ ఉండదు.. అవి మళ్లీ తిరిగి పుడతాయి. ఢిల్లీ.. నీ బిడ్డ తిరిగొచ్చాడు’ అని షా భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మన ప్లేయర్ తిరిగి తన సొంత గూటికి చేరడాంటూ’ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.


అండర్ 19 ప్రపంచ కప్ 2018లో భారత జట్టుకు పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో టీమిండియా వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అప్పట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పృథ్వీని రూ.1.2కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా 79 మ్యాచ్‌ల్లో 1892 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలున్నాయి. ఇదిలా ఉండగా.. గత సీజన్‌లో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. ఐదో స్థానంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఈసారైనా కప్పు కొట్టాలని ఉవ్విళూరుతోంది. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

ఇషాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన యువ ప్లేయర్..వీడియో వైరల్

డ్రెస్సింగ్ రూమ్‌లోకి మద్యం, సిగరెట్.. మెక్‌కలమ్‌పై సంచలన ఆరోపణలు

Updated Date - Mar 22 , 2026 | 03:08 PM