కోల్‘కథ’ మారితేనే..
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:50 AM
‘అంగట్లో అన్నీ ఉన్నా..’ అన్నట్టుగా ఉంది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు పరిస్థితి. పరుగుల సునామీ సృష్టించగల హిట్టర్లకు కొదవలేదు. పైగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు...
ఐపీఎల్ 5 రోజుల్లో
వేధిస్తున్న గాయాల బెడద జూ పవర్‌హిట్టర్లే బలం
‘అంగట్లో అన్నీ ఉన్నా..’ అన్నట్టుగా ఉంది కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు పరిస్థితి. పరుగుల సునామీ సృష్టించగల హిట్టర్లకు కొదవలేదు. పైగా ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు తమ అమ్ములపొదిలోనే ఉన్నారు. యువ, అనుభవం కలగలిసిన పేసర్లు ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు సదా సిద్ధంగా ఉంటారు. మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ మాత్రం ఇటీవలి కాలంలో అంచనాలను అందుకోలేక పోతోంది. ఇప్పటిదాకా జరిగిన 18 సీజన్లలో పదిసార్లు లీగ్ దశకే పరిమితమైంది. దీనికితోడు చివరి నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్ దాకా వచ్చింది. 2025లో అయితే మరీ ఎనిమిదో స్థానంతో నిరాశపర్చింది. అందుకే గత మినీ వేలంలో పది మందిని వదిలేసి బరిలోకి దిగింది. సుదీర్ఘకాలం కేకేఆర్‌తో కొనసాగిన ఆండ్రీ రస్సెల్‌కు ఉద్వాసన పలకగా, బ్యాటింగ్‌ను పటిష్టం చేసుకునేందుకు సైఫర్ట్, ఆలెన్, రచిన్‌లతో పాటు రూ.25.20 కోట్లతో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను తీసుకుంది. పథిరన, ముజరబానిలతో పేస్ విభాగాన్ని పటిష్టం చేసుకుంది. అలాగే కోచ్‌ను కూడా మార్చి అభిషేక్ నాయర్‌కు బాధ్యతను అప్పగించారు.
బలం
కేకేఆర్ జట్టు ప్రధానంగా స్వదేశీ, విదేశీ పవర్‌హిట్టర్లతో బలంగా కనిపిస్తుంది. రఘువంశీ, రమణ్‌దీప్, పోవెల్, ఆలెన్, సైఫర్ట్, గ్రీన్, రింకూ, నరైన్ బంతిని బలంగా బాదే సత్తా కలిగి వారే. ముఖ్యంగా ఇటీవలి టీ20 వరల్డ్‌కప్‌లో ఆలెన్, సైఫర్ట్‌ల ఓపెనింగ్ విధ్వంసం అభిమానులకు తెలిసిందే. ఈ సీజన్‌లో వీరినే కొనసాగించే అవకాశం ఉంది. ఇక స్పిన్ బౌలింగ్ కూడా జట్టుకు ప్రధాన ఆయుధంగా ఉంది. వరల్డ్ నెంబర్‌వన్ వరుణ్ చక్రవర్తి, నరైన్‌లకు తోడు తాజాగా రచిన్ కూడా జత చేరాడు. ఈ త్రయం ప్రత్యర్థి జట్లను తికమకపెట్టడం ఖాయం.
బలహీనత
కోల్‌కతా పేస్ విభాగం గాయాల సమస్యను ఎదుర్కొంటోంది. ఇప్పటికే కీలక హర్షిత్ రాణా పూర్తి సీజన్‌కు దూరమవ్వడం గట్టి దెబ్బే. రూ.18 కోట్లతో తెచ్చుకున్న పథిరన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సివుంది. పైగా గతేడాది తను చెన్నై తరఫున రాణించలేకపోయాడు. ఇక జింబాబ్వే పేసర్ ముజరబానికి ఐపీఎల్ అనుభవం లేదు. దేశవాళీ పేసర్లు వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, ఆకాశ్ దీప్, ఉమ్రాన్ మాలిక్, సోలంకి ఏమేరకు ప్రభావం చూపుతారనేది సందేహమే. జట్టు తొలి మ్యాచ్ వాంఖడేలో ఉండడంతో అక్కడి వికెట్‌పై వీరి పేస్ బలహీనత బయటపడే అవకాశముంది. అలాగే కెప్టెన్ రహానె గతేడాది పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అటు బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు.
ఇదే జట్టు
స్వదేశీ ఆటగాళ్లు: రహానె (కెప్టెన్), మనీశ్ పాండే, రమణ్‌దీప్, ఎ. రఘువంశీ, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, తేజస్వి సింగ్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా.
విదేశీ ఆటగాళ్లు: కామెరూన్ గ్రీన్, ఆలెన్, పథిరన, సైఫర్ట్, ముజరబాని, రచిన్ రవీంద్ర, పోవెల్, నరైన్.
(ఆంధ్రజ్యోతిక్రీడావిభాగం)
ఇవి కూడా చదవండి:
ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు
చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!