14 రోజుల్లో 50 లక్షల టన్నుల ఉద్గారాలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:32 AM
ఇరాన్- అమెరికా యుద్ధంలో ప్రాణ, ఆస్తి నష్టంతోపాటు పర్యావరణానికి కూడా కోలుకోలేని నష్టం జరుగుతోంది. ఈ యుద్ధంలో తొలి 14 రోజుల్లోనే వాతావరణంలోకి ఏకంగా...
యుద్ధంతో వాతావరణ వినాశనం
న్యూఢిల్లీ, మార్చి22: ఇరాన్- అమెరికా యుద్ధంలో ప్రాణ, ఆస్తి నష్టంతోపాటు పర్యావరణానికి కూడా కోలుకోలేని నష్టం జరుగుతోంది. ఈ యుద్ధంలో తొలి 14 రోజుల్లోనే వాతావరణంలోకి ఏకంగా 50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలకు సమానమైన కాలుష్య కారకాలు(టీ సీవో2ఈ) విడుదలయ్యాయని క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్‌స్టిట్యూట్ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇది భూమిపై 84 తక్కువ కాలుష్య దేశాలు సంవత్సర కాలంలో విడుదల చేసే ఉద్గారాలకు సమానమని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్యాట్రిక్ బిగ్గర్ తెలిపారు. ఈ యుద్ధం వాతావరణ ఉష్ణోగ్రతను పెంచి భూగోళాన్ని అస్థిరంగా మారుస్తోందని హెచ్చరించారు. ‘ఇది భద్రత కోసం జరుగుతున్న యుద్ధం కాదు.. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థల కోసం జరుగుతున్న యుద్ధం. ఇరాన్‌లోని సాధారణ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గమే ఈ యుద్ధ బాధితులు’ అని పేర్కొన్నారు. ఇరాన్ రెడ్‌క్రాస్ లెక్కల ప్రకారం ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడుల కారణంగా ఇరాన్‌లో 20 వేల పౌర నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల 24 లక్షల టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలయ్యాయి. ఈ యుద్ధంలో పాల్గొంటున్న విమానాలు, నౌకలు, ఇతర వాహనాల కోసం తొలి 14 రోజుల్లో 27 కోట్ల లీటర్ల వరకు ఇంధనం వాడినట్లు అంచనా.