బైక్ స్క్రాప్.. రూ.800.. ఆర్‌వీఎస్ఎఫ్‌ల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Mar 23 , 2026 | 08:05 AM
హైదరాబాద్ గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల గడువు ముగిసిన తన ద్విచక్రవాహనం (యాక్టీవా) స్క్రాప్ చేయాలని రవాణా శాఖ అధికారిక గుర్తింపు పొందిన ఓ ఏజెన్సీని సంప్రదించాడు. వాహనం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), లోకేషన్ వాట్సప్‌లో పంపాలని సూచించారు.
హైదరాబాద్ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల గడువు ముగిసిన తన ద్విచక్రవాహనం (యాక్టీవా) స్క్రాప్ చేయాలని రవాణా శాఖ అధికారిక గుర్తింపు పొందిన ఓ ఏజెన్సీని సంప్రదించాడు. వాహనం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), లోకేషన్ వాట్సప్‌లో పంపాలని సూచించారు. ఆ వ్యక్తి ఫొటోలు పంపగా.. మీ వద్దకు వచ్చి వాహనం తీసుకుంటే రూ.800, మీరే సమీపంలోని కార్యాలయం వద్దకు తీసుకువస్తే రూ.950, నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని స్క్రాపింగ్ సెంటర్‌కు తీసుకువస్తే రూ.1850 ఇస్తామని కొటేషన్ పంపారు. దీంతోపాటు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్(సీఓడీ) ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ఆ వ్యక్తి వాహనం స్క్రాప్ చేయాలనే ఆలోచన విరమించుకున్నాడు. బైక్ కనీసం జ్ఞాపకంగా అయినా ఉంటుందని భావిస్తున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి 20 (ఐదేళ్ల ఫిట్నెస్ రెన్యూవల్ అనంతరం) యేళ్లు దాటిన కారు స్క్రాపింగ్ చేయాలని భావించి.. మరో ఏజెన్సీకి వివరాలు పంపాడు. రూ.12వేల వరకు ఇస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పడంతో వెనక్కి తగ్గాడు. వీరిద్దరే కాదు. నగరంలోని చాలా మంది వాహనం స్క్రాప్ చేయాలనుకుంటున్న యజమానులది ఇదే పరిస్థితి. ఏజెన్సీలు ఇచ్చే మొత్తంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం వాహనం తూకం మేరకూ డబ్బులు రావడం లేదని వాపోతున్నారు. దీంతో వాహనాలను స్క్రాప్ చేయడం కంటే, తెలిసిన వారికి ఉచితంగా ఇవ్వడమో... ఎంతో కొంతకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
15 ఏళ్లు దాటితే..
15 యేళ్లు దాటిన వాహనాల వినియోగంతో పర్యావరణంపై ప్రభావం పడుతోందని భావించిన ప్రభుత్వం వాటిని స్క్రాప్ చేయించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌వీఎస్ఎఫ్) పేరిట మూడు ఏజెన్సీలను ఎంపిక చేసింది. 15 యేళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను స్క్రాప్ చేయాలని గతంలోనే రవాణా శాఖ ఆదేశించింది.
దుర్వినియోగం నేపథ్యంలో..
15 యేళ్లు దాటిన వాహనాలను గతంలో కొందరు ఇతరులకు విక్రయించే వారు. కొనుగోలు చేసిన వ్యక్తులు వాహనాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా దుర్వినియోగం చేస్తున్న ఘటనలు జరిగాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, గంజాయి, అక్రమ మద్యం రవాణా, చైన్ స్నాచింగ్, వాహనాలపై ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకాలాపాలు చేస్తూ పోలీసులకు పట్టుబడినప్పుడు పాత యజమానులపై కేసులు నమోదవుతున్నాయి. ఈ భయంతో చాలామంది 15 యేళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని భావిస్తున్నారు. అయితే పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. 15 యేళ్లు దాటిన వాహనం ఇతరులకు విక్రయించి.. వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫిట్నెస్ టెస్టులతోపాటు రెన్యూవల్ చేయించాల్సి ఉంటుంది. ఇందుకు బైక్‌లకు గ్రీన్ ట్యాక్స్ రూ.2,500, రూ.1,000 వరకు రెన్యూవల్ ఛార్జీలు.. గడువు ముగిసిన అనంతరం ప్రతీ నెలా రూ.300 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. అదే కార్లకైతే గ్రీన్ ట్యాక్స్ రూ.5,000, నెలకు రూ.500 చొప్పున పెనాల్టీ, రూ.2,500 నుంచి రూ.3,000 వరకు రెన్యూవల్ ఛార్జీలు ఉంటాయి. 15 యేళ్లు దాటిన అనంతరం నెల, రెండు నెలలోపు అయితే ద్విచక్రవాహనాల ఫిట్నెస్ టెస్టుకు రూ.4,500- 5,000 వరకు, ఏడాది దాటితే రూ.7,500-8,500 వరకూ ఖర్చవుతోంది. ఈ మొత్తం వెచ్చించలేక స్క్రాప్ చేయాలని భావిస్తుండగా.. ఏజెన్సీలు చెల్లిస్తోన్న మొత్తం నామమాత్రంగా ఉంటుండడంతో మనసు మార్చుకుంటున్నారు. ఈ విషయంపై రవాణా శాఖ అధికారులూ తామేం చేయలేమని చేతులెత్తేస్తుండడం గమనార్హం.
నేటి నుంచి అదనపు ట్యాక్స్ బంద్..
ఎన్ని వాహనాలు కొనుగోలు చేసినా అదనపు లైఫ్ ట్యాక్స్ వసూలు ఉండదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. దీంతో ఇంతకుముందే వాహనం ఉన్నా ప్రస్తుతం వసూలు చేస్తున్న రెండు లేదా అంత కంటే ఎక్కువ శాతం అదనపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బైక్ ఉండి కొత్త వాహనం కొనుగోలు చేస్తే ద్విచక్రవాహనాలకు ప్రస్తుతం 14 శాతం (సాధారణంగా 12 శాతం) లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కార్లకు విలువను బట్టి ప్రస్తుతం 13 నుంచి 18 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇకపై ఆ అవసరం ఉండదు. దీంతో వాహనాలు స్క్రాప్ చేసేందుకు పౌరులు ముందుకు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు