ఆశాలు, ఎన్‌హెచ్‌ఎమ్ ఉద్యోగులకు.. 20 లక్షల ప్రమాద బీమా!
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:19 AM
రాష్ట్రంలోని అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా వర్కర్స్)లు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎమ్) ఉద్యోగులకు రూ.20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సహజ మరణానికి 2 లక్షల బీమా సౌకర్యం..
ఆశా, ఎన్‌హెచ్‌ఎమ్ ఉద్యోగ సంఘాలతో మంత్రి రాజనర్సింహ చర్చలు
బీమా సౌకర్యం కల్పించేందుకు అంగీకారం
27,130 మంది ఆశాలు, 18 వేలమంది ఎన్‌హెచ్‌ఎమ్‌లకు ప్రయోజనం
బీమాపై ఎస్‌బీఐ, యూనియన్
బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు
వచ్చే ఏడాది జనవరి నుంచి బీమా అమలుచేయాలని యోచన
ఆశాలకు వేతనం రూ.18 వేలకు పెంచాలి: ఆశా యూనియన్ అధ్యక్షురాలు మైముద
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా వర్కర్స్)లు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎమ్) ఉద్యోగులకు రూ.20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సహజ మరణాలకు సైతం రూ.2 లక్షల బీమా కల్పించాలని నిర్ణయించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాఽధికారులతో శుక్రవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఆశా, ఎన్‌హెచ్‌ఎమ్ సంఘాల ప్రతినిధులతో కూడా మంత్రి చర్చలు జరిపారు. తమకు ప్రమాద బీమా కల్పించాలని ఆశా వర్కర్లు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్‌తో పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రాష్ట్రంలో 27,130 మంది ఆశా కార్యకర్తలున్నారు. ఎన్‌హెచ్‌ఎమ్ కింద సుమారు 18 వేల మంది వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు.
శాశ్వత ఉద్యోగులు కాకపోవడంతో వీరికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆరోగ్య బీమా, ఇతర సదుపాయాలు అందడం లేదు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాలకు గురైతే వీరికి ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందటం లేదు. ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారికి ముందుగా ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం లీడ్ బ్యాంకులైన ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకుల ప్రతినిధులతో శుక్రవారం చర్చలు జరిపింది. ఎస్‌బీఐలో 18 వేలమంది ఆశాలకు పొదుపు ఖాతాలున్నాయి. యూబీఐలో 5 వేలున్నాయి. మిగతావి వేర్వేరు బ్యాంకుల్లో ఉన్నాయి. మొత్తం ఆశాలు, ఎన్‌హెచ్‌ఎమ్‌ల వేతన ఖాతాలను ఈ రెండు బ్యాంకుల్లో ఏర్పాటుచేయనున్నారు. అందుకు ప్రతిగా వారికి ఆ రెండు బ్యాంకులు రూ.20 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల జనరల్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఈ మేరకు బ్యాంకులు అంగీకరించాయని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు..
ప్రస్తుతం ఆశా కార్యకర్తలకు ప్రసూతి సెలవులు 120 రోజులే ఇస్తున్నారు. ఆ సెలవు కాలంలో వేతనం కూడా ఇవ్వటం లేదు. దీంతో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని వారు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్‌పై సర్కారు సానుకూలంగా స్పందించింది. 180 రోజులపాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేందుకు అంగీకరించింది. రెండు కాన్పుల వరకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఈహెచ్‌ఎ్‌స పరిఽధిలోకి తీసుకురావాలన్న ఆశా, ఎన్‌హెచ్‌ఎంల డిమాండ్‌పై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది.
జనవరి నుంచి అమలు..
ఆశాలు, ఎన్‌హెచ్‌ఎమ్ ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జనవరిలోగా ఖరారు చేయనుంది. బీమాతోపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు రెండుమూడు నెలల సమయం పడుతుందని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
వేతనం కూడా పెంచాలి
ఆశాలకు ప్రమాద బీమా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రసూతి సెలవులను పెంచడంతోపాటు ఆ కాలంలో వేతనం చెల్లించే విషయంలో కూడా సానుకూలంగా స్పందించింది. ఆశాలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఆశాలలో 61 ఏళ్ల వయసు దాటినవారిని తొలగిస్తున్నారు. అలాంటివారు సుమారు 90 మంది ఉన్నారు. వీరి కుటుంబాల్లో అర్హులైన వారుంటే ఆశాలుగా అవకాశం కల్పించాలని సర్కారును కోరాం.
- ఎం.డి. మైముద,
రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News