యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వొద్దా.. బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
ABN , Publish Date - May 23 , 2026 | 04:24 PM
బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కోట్లు పెడతామని మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా అని మండిపడ్డారు.
హైదరాబాద్, మే 23: బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు చీప్ పాలిటిక్స్.. బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయొద్దని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు కోరుకున్నది తప్పకుండా చేసి తీరుతామన్నారు. వేలాది కోట్లు పెడతామని మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ తెచ్చిన మెట్రోనే ముందుకు సాగిందని మంత్రి తెలిపారు. తాము ఎన్ని కిలోమీటర్లు తెచ్చామో అన్ని కిలోమీటర్లు మాత్రమే మెట్రో వచ్చిందని చెప్పారు. మెట్రోను విస్తరిద్దామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పెరిగిన జనాభాకి అనుగుణంగా మెట్రో విస్తరించకూడదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలా? వద్దా? హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని.. అయినా ఆ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని వ్యాఖ్యానించారు.
నగరాన్ని విస్తీర్ణం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇతర నగరాల అభివృద్ధిపై అధ్యయనం చేశామన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ఓటమితో ఎదురైన నిరాశ నుంచి ఇప్పటికీ బయటకి రాలేకపోతున్నారన్నారు. బుల్లెట్ ట్రైన్ తెస్తామంటే.. ఎందుకని బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వొద్దా అని అన్నారు. స్వార్థ రాజకీయాలే తమకి ముఖ్యమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విరుచుకుపట్టారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఘటనలో గాయపడ్డ న్యాయవాది కన్నుమూత
వికసిత భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News