Share News

వికసిత భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN , Publish Date - May 23 , 2026 | 03:56 PM

2022లో దీపావళి రోజున మొదలైన రోజ్‌గార్ మేళా ద్వారా ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది కేవలం ఉద్యోగాల కార్యక్రమం కాదని, యువత భవిష్యత్తు కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద మిషన్ అని చెప్పుకొచ్చారు.

వికసిత భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర:  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్, మే 23: దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో జరిగిన రోజ్‌గార్ మేళాలో 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం నాడు బోయిగూడలోని రైల్ కళారంగ్‌లో జరిగిన 19వ రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈరోజు 220 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నారన్నారు. 2022లో దీపావళి రోజున మొదలైన రోజ్‌గార్ మేళా ద్వారా ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ఇది కేవలం ఉద్యోగాల కార్యక్రమం కాదని, యువత భవిష్యత్తు కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద మిషన్ అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో కూడా కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు.


స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ..

స్టార్టప్స్, యూనికార్న్స్ వల్ల యువత ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చిందని కేంద్రమంత్రి అన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, మెట్రోలు, ఇండస్ట్రియల్ కారిడార్లు వంటి ప్రాజెక్టులతో భారీగా ఉపాధి పెరుగుతోందన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం రూ.12 లక్షల కోట్ల ఇన్‌ఫ్రా పనులు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి లక్ష కోట్ల పెట్టుబడికి 14 నుంచి 15 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. యువతను మోదీ ‘వికసిత భారతానికి సూపర్ హీరోలు’గా చూస్తున్నారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా కోట్ల మంది యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. గ్రామీణ యువతకు కూడా AI, IoT వంటి ఆధునిక టెక్నాలజీని మాతృభాషలో నేర్పిస్తున్నామని తెలిపారు.


అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్...

భారత యువత ప్రపంచస్థాయిలో రాణిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సెమీకండక్టర్లు, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలో భారత్ ముందుకు వెళ్తోందన్నారు. చంద్రుడి దక్షిణ ధృవానికి ముందుగా చేరిన దేశం భారత్ అని చెప్పుకొచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో స్వదేశీ డ్రోన్లు శత్రు క్షిపణులను అడ్డుకున్నాయని అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు, పీఎం-శ్రీ స్కూల్స్ సంఖ్య పెంచామని తెలిపారు. భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. 2014కు ముందు వందల స్టార్టప్స్ మాత్రమే ఉండగా, ఇప్పుడు 1.2 లక్షలకు పైగా ఉన్నాయన్నారు. మైనింగ్, బొగ్గు రంగాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని యువతకు సూచించారు. మైనింగ్, ఇంజనీరింగ్ వంటి కోర్సులపై యువత దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

టెక్నోరీచ్ సీఈఓపై వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఘటనలో గాయపడ్డ న్యాయవాది కన్నుమూత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2026 | 04:03 PM