భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..
ABN , Publish Date - Feb 25 , 2026 | 06:07 PM
భారతీయ రైల్వేలో పార్సిల్ యాప్‌తో సరికొత్త అధ్యాయానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): భారతీయ రైల్వేలో పార్సిల్ యాప్‌తో సరికొత్త అధ్యాయానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway App Launch) శ్రీకారం చుట్టింది. రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘రైల్ పార్సిల్ యాప్’ పేరుతో లాజిస్టిక్ సర్వీస్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే - హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రైల్ పార్సిల్ యాప్‌ని డెవలప్ చేసింది. సికింద్రాబాద్ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రైల్ పార్సిల్ యాప్‌ని లాంచ్ చేశారు.
మొదటగా 7 నగరాల్లో..
ఇంటి వద్దనే పార్సిల్ బుకింగ్, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో ‘రైల్ పార్సిల్ యాప్’ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్‌లో అమలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. మొదటగా 7 నగరాల్లో ‘రైల్ పార్సిల్ యాప్’ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలలో ఈ సర్వీసులని అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే.. ఇతర మూడు లాజిస్టిక్ పార్టన్స్‌తో కలిసి డోర్ టు, మిడిల్, మెయిన్ డెలివరీ సర్వీసులకి శ్రీకారం చుట్టింది.
మీ ఇంటి వద్ద నుంచే ఈ యాప్ సేవలు..
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడారు. ప్రజలు నేరుగా మీ ఇంటి వద్ద నుంచే ‘రైల్ పార్సిల్ యాప్’ సేవలని వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ యాప్‌తో అతి సులువుగా, వేగంగా పార్సిల్స్ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలో ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్‌పై అధ్యయనం చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)- బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకుందని వివరించారు.
వన్‌స్టాప్ వేదికగా ఈ యాప్ ..
రైల్ పార్సిల్ యాప్.. ఫస్ట్ మైల్ (పికప్), మిడ్ మైల్ (రైల్వే ద్వారా రవాణా), లాస్ట్ మైల్ (డెలివరీ) సేవలను సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానించేలా ఈ యాప్ సేవలు ఉంటాయని తెలిపారు. ఇది పార్సిల్ సేవలను సులభతరం చేస్తుందని తెలిపారు. వినియోగదారులు ఇంటి నుంచి పార్సిల్ సరుకులను బుకింగ్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వన్‌స్టాప్ వేదికగా ఈ యాప్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. పరిశ్రమ, వినియోగదారులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే డిజిటల్ పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి ఈ యాప్‌ని రూపొందించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
అనాథలకు ఉపాధి కల్పన.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
Read Latest Telangana News And AP News And Telugu News