నా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Aug 24 , 2026 | 04:29 PM
వికసిత్ భారత్ 2047లో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047ను ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 24: వికసిత్ భారత్ 2047లో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047ను ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(సోమవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధి దిశగా వెళ్లాలనేదే తమ యోచన అని పేర్కొన్నారు. పెట్టుబడుల సాధన కోసమే విదేశీ పర్యటనకు సంకల్పించామని వివరించారు. అయితే, దురుద్దేశపూర్వకంగా తన అమెరికా పర్యటనను కేంద్రం తిరస్కరించిందని ఆరోపించారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలనేదే సమాఖ్య స్ఫూర్తి అని తెలిపారు.
కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు..
టీబీజేపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి ప్రభుత్వం, తన అధికారిక పర్యటనలపై బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలపై ఆరోపణలు చేయదలచుకోలేదని.. ఎందుకంటే వారికి ఆ స్థాయి లేదంటూ వ్యాఖ్యానించారు. పెట్టుబడుల సాధన కోసం గతంలోనూ విదేశీ పర్యటనకు వెళ్లామని వివరించారు. ఢిల్లీలో ఉన్న కొందరు బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తన అధికారిక పర్యటనపై కేంద్రానికి అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు.
విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని సంకల్పించాం..
‘మేము ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నా పర్యటన పూర్తి వివరాలు కేంద్రానికి ఇచ్చాం. విద్య, క్రీడల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని సంకల్పించాం. అమెరికా పర్యటనలో ప్రఖ్యాత యూనివర్సిటీలు, పెట్టుబడిదారులను కలుస్తామని కేంద్రానికి చెప్పాం. రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మాకు బదులిచ్చింది. ఇంగ్లండ్ పర్యటనకు అనుమతి ఇచ్చారు.. అమెరికా పర్యటనను ఎందుకు తిరస్కరించారు? గుజరాత్ సీఎంకి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతిచ్చారు. నా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. తిరస్కరణకు రాజకీయ కారణాలు చెబుతున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాది చాటుమాటు పర్యటన కాదు..
మోదీ ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిలానే వ్యవహరిస్తున్నారని.. దేశానికి ప్రధాన మంత్రిగా వ్యవహరించడం లేదని సీఎం విమర్శించారు. గుజరాత్ నేతలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. గుజరాత్ ఆధిపత్యానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. టీబీజేపీ ఎంపీలు గుజరాత్‌ను సపోర్ట్ చేస్తున్నారా? టీబీజేపీ ఎంపీలకు తెలంగాణ అభివృద్ధి అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘నా పర్యటనను అడ్డుకోవడమంటే.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. నా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణపై వివక్ష చూపించడమే. నా పర్యటనను అడ్డుకున్నారు.. మా లక్ష్యాలను అడ్డుకోలేరు. నాది చాటుమాటు పర్యటన కాదు.. అధికారిక పర్యటన. విదేశాల్లో ఉండగా స్పందిస్తే.. దేశద్రోహి అనేవారు. అందుకే ఇక్కడికి వచ్చి కేంద్రం వైఖరిపై మాట్లాడుతున్నా. ఏ విదేశీ పర్యటన అయినా భారత ఎంబసీ పర్యవేక్షిస్తుంది. మా పర్యటన వివరాలను వారే కేంద్రానికి తెలియజేస్తారు. ఇందులో రహస్యం ఏముంది’ అని ప్రశ్నించారు.
తెలంగాణ అంటే చిన్నచూపు..
కేంద్రానికి తెలంగాణ అంటే చులకన, చిన్నచూపు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. తన పర్యటనను అడ్డుకోవడం పూర్తిగా వివక్షే అని అన్నారు. ఈ అంశాన్ని రాహుల్, ఖర్గే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. విదేశాంగశాఖ అధికారి బీజేపీలో చేరడం మంచిదని హితవుపలికారు. కాంగ్రెస్ సీఎంననే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. మెట్రో సహా చాలా అంశాల్లో కేంద్రం సహకరించట్లేదన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మోదీకి బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప.. ఇతర ప్రాంతాల అభివృద్ధి అవసరంలేదన్నారు. కేంద్రం వివక్షను సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి
ఈగల్ శాఖలో ఇంటి దొంగల బాగోతం.. డ్రగ్స్ పెడ్లర్లతో కలిసి
Read Latest Telangana News And Telugu News