పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం
ABN , Publish Date - May 16 , 2026 | 10:16 AM
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని సీఎం అన్నారు.
హైదరాబాద్, మే 16: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సీఎం విమర్శించారు.
ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని సీఎం అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని... యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిందన్నారు. గత పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందని... ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అంటూ విరుచుకుపడ్డారు.
ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని రేవంత్ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ‘పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచం’ అని పదే పదే ప్రకటించిందని గుర్తుచేశారు. ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమే అని అన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని... ఇది విశ్వాస ఘాతుకం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
రైలు ఢీకొడుతున్నా.. ప్రాణాలకు తెగించి పిల్లలను రక్షించిన తల్లి! వీడియో వైరల్
పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు
Read Latest Telangana News And Telugu News