Share News

కాకినాడలో ఘోర ప్రమాదం.. టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి కూలీల మృతి

ABN , Publish Date - May 16 , 2026 | 08:54 AM

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవూరు బ్రిడ్జి వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..

కాకినాడలో ఘోర ప్రమాదం.. టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి కూలీల మృతి
Kakinada Accident News

కాకినాడ, మే 16: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవూరు బ్రిడ్జి వద్ద శనివారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న కూలీలను.. టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ లారీ వారిపైకి దూసుకెళ్లింది. లారీ వేగాన్ని నియంత్రించలేకపోవడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


చనిపోయిన కూలీలు.. సత్యవతి, కృష్ణమ్మ, చిట్టెమ్మ, అన్నవరం‌గా గుర్తించారు. వీరంతా స్థానిక చీడిగ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.


కాకినాడ రోడ్డు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి..

కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్న నలుగురు మహిళా కూలీలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే మంత్రి నారాయణ స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి లోటు రాకుండా, తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని, వైద్య అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 16 , 2026 | 10:18 AM