Share News

రైలు ఢీకొడుతున్నా.. ప్రాణాలకు తెగించి పిల్లలను రక్షించిన తల్లి! వీడియో వైరల్

ABN , Publish Date - May 16 , 2026 | 07:46 AM

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాహ్‌పూర్ పటోరి రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే..

రైలు ఢీకొడుతున్నా.. ప్రాణాలకు తెగించి పిల్లలను రక్షించిన తల్లి! వీడియో వైరల్
Mother Saves Children Viral Video

ఇంటర్నెట్ డెస్క్: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాహ్‌పూర్ పటోరి రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. పట్టాలు దాటుతున్న ఇద్దరు పిల్లలను కాపాడేందుకు ఒక తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మల్హేరా సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన వారంతా షాక్‌కు గురవుతున్నారు.


వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌లో... వేగంగా దూసుకొస్తున్న రైలు ముందు ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు పట్టాలపై చిక్కుకుపోయి కనిపించారు. రైలు వేగంగా దూసుకువస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో.. తల్లి తన పిల్లలను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. రైలు వేగానికి వచ్చే గాలి, ఒత్తిడి వల్ల ఆ మహిళను రైలు ఇంజన్, బోగీలు పదేపదే బలంగా ఢీకొంటూ, రాసుకుంటూ వెళ్లాయి. అయినప్పటికీ ఆమె ఏమాత్రం భయపడకుండా .. తన పిల్లలను గట్టిగా పట్టుకుని రక్షించడానికి ప్రయత్నించింది.

ఒకానొక దశలో రైలు వేగానికి ఆ తల్లి రైలు కింద పడిపోయేంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆమె పక్కనే ఉన్న మరో మహిళ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. ఆమె పట్టాలపై పడిపోకుండా గట్టిగా పట్టుకుంది. రైలు వెళ్లిన తర్వాత వారంతా క్షేమంగా లేచి పక్కకు వచ్చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కన్నబిడ్డల కోసం ప్రాణాలకు తెగించిన ఆ తల్లి మాతృత్వానికి నెటిజన్లు సలాం కొడుతుండగా.. రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.

Updated Date - May 16 , 2026 | 08:17 AM