కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:40 PM
‘మహిళా శక్తే మా ప్రభుత్వ శక్తి. మా ఆడబిడ్డల ఆశీర్వాదమే నాకు అండ. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 8: ‘ఆడబిడ్డలతో నా పుట్టినరోజును జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదమే నా బలం. నాకు ఏ కోరికలు లేవు. గొప్ప పదవుల కోసం ఆశించట్లేదు. నా జీవిత లక్ష్యం ఒక్కటే.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం. అందుకు నా సర్వశక్తులు ధారపోస్తాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
‘ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివించండి. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడొద్దు. మీ ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తామని నా పుట్టిన రోజున మాట ఇవ్వండి. ఆడబిడ్డల చేతిలో పెత్తనం ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆడబిడ్డలు నేడు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ భాగస్వాములుగా ఉన్నారు. మహిళా సంఘాలకు రూ.79వేల కోట్ల రుణాలిచ్చాం. మహిళా రుణాలకు రూ.1,900 కోట్ల వడ్డీ చెల్లించాం. ఇంటి పట్టా మహిళలకే ఇచ్చాం. మహాలక్ష్మి పథకానికి ఇప్పటిదాకా రూ.13వేల కోట్లు ఇచ్చాం. ఆటోవాళ్లతో కలిసి నాపై యుద్ధానికి వచ్చారు కానీ.. ఈ పథకం ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టింది. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదు.
ఏ సీఎం అయినా సన్న బియ్యం ఇచ్చారా? మా ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రిపదవి ఇవ్వలేదు. మేమిచ్చాం. 34 నెలల్లో మహిళలకు 79 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. ఈరోజు 4.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే.. అందులో ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు 3.5 లక్షల పెన్షన్లు అందుతున్నాయి. సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన దుర్మార్గుడు కేటీఆర్. పదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారో.. ఏమిచ్చారో ఆయన్ను అడగండి. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. మీ సంతోషమే నా సంతోషం. మీ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలి’ అని రేవంత్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News