Share News

రావిర్యాల భూములు బ్లాక్‌లో

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:20 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం సర్వే నంబరు 8 భూముల్లో జరిగిన అక్రమాలపై ’రావిర్యాల భూమాయ’ శీర్షికతో ఆంధ్రజ్యోతి శనివారం ప్రచురించిన కథనం సంచలనం రేపింది.

రావిర్యాల భూములు బ్లాక్‌లో
Raviryala Land

  • ఆంధ్రజ్యోతి కథనంతో కదిలిన యంత్రాంగం

  • తహసీల్దార్‌కు మెమో.. విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

  • రూ.35.29 కోట్ల విలువపై ’సాంకేతిక లోపం’ సాకు

  • హైకోర్టు ఆదేశాలున్నా సబ్‌ డివిజన్‌, రిజిస్ట్రేషన్లు ఎలా?

  • కలెక్టర్‌ వివరణలో సమాధానం దొరకని ప్రశ్నలెన్నో

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం సర్వే నంబరు 8 భూముల్లో జరిగిన అక్రమాలపై ’రావిర్యాల భూమాయ’ శీర్షికతో ఆంధ్రజ్యోతి శనివారం ప్రచురించిన కథనం సంచలనం రేపింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సర్వే నంబరు 8లోని భూ లావాదేవీలను బ్లాక్‌లో పెట్టినట్లు తెలిపారు. ఈ భూమిపై వివాదం నడుపుతున్న ప్రత్యర్థి రైతులు కోర్టు స్టే ఆర్డర్‌ను ఈ నెల 5న తనకు ఇచ్చి అప్పీల్‌ చేశారని, దానికి అనుగుణంగా భూమిని బ్లాక్‌ చేశామని ఆయన వివరించారు. దీనిపై వివరణ కోరుతూ మహేశ్వరం తహసీల్దార్‌కు మెమో జారీ చేశామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారమే భూభారతి దరఖాస్తును ప్రాసెస్‌ చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు.


ఒప్పుకుంటూనే.. ’సాంకేతిక’ సాకు

భూముల మార్కెట్‌ విలువ తప్పుగా నమోదైన విషయాన్ని కలెక్టర్‌ ఒప్పుకున్నారు. అయితే దాన్ని సాంకేతిక లోపంగా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. గత వారం రోజులుగా భూభారతిలో కొత్తగా అప్రూవల్‌ ఇచ్చిన భూముల పహానీల్లో మార్కెట్‌ విలువ రూ.35.29 కోట్లుగా కనిపించిందని, సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని ఆయన చెప్పారు. లోపాన్ని గుర్తించిన వెంటనే సీసీఎల్‌ఏ కార్యాలయానికి తెలపగా, అక్కడి అధికారులు సమస్యను సరిచేశారన్నారు. మార్కెట్‌ విలువను మార్చడం తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ లాగిన్‌ వరకు ఎవరికి కూడా సాధ్యం కాదని, ప్రస్తుతం పోర్టల్‌లో సరైన విలువే కనిపిస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే రూ.35.29 కోట్లు సాంకేతిక లోపమే అయితే, మరుసటి రోజు గంటల వ్యవధిలో విలువ రూ.1.19 కోట్లకు, ఆ తర్వాత రూ.60.90 లక్షలకు ఎలా మారిందన్న దానిపై కలెక్టర్‌ వివరణలో ప్రస్తావనే లేదు.


సమాధానం లేని ప్రశ్నలు

కలెక్టర్‌ వివరణ తర్వాత కూడా ఈ వ్యవహారంలో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబు లేదు. సర్వే నంబరు 8లో వివాదంలో ఉన్న 11 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని, చట్టబద్ధమైన ఆధారాలు లేకున్నా రెవెన్యూ అధికారుల సహకారంతోనే బదలాయింపు జరిగిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములను నిషేధిత జాబితాలోనే కొనసాగించాలని, పాస్‌ పుస్తకాలు ఇవ్వవద్దని హైకోర్టు, సివిల్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చాయి. బదలాయింపు నిర్ణయాలను పక్కన పెట్టాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులన్నీ ఉండగా ఏ కోర్టు ఆదేశాల ప్రకారం దరఖాస్తును ప్రాసెస్‌ చేశారు? సర్వే నంబరును ఏ ఆధారంతో సబ్‌ డివిజన్‌ చేశారు? నిషేధిత జాబితాలోని భూమికి రిజిస్ట్రేషన్‌కు ఎలా అనుమతించారు? మార్కెట్‌ విలువ మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదంటే, రెండు రోజుల్లో నాలుగు విలువలు ఎలా నమోదయ్యాయి? రూ.35.29 కోట్ల విలువ చూపిన ఇతర భూములు ఎన్ని, ఆ వ్యవధిలో వాటిపై ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి? విలువ మార్చే అధికారమే లేదంటే తహసీల్దార్‌కు మెమో ఏ అంశంపై ఇచ్చారు? ఈ ప్రశ్నలకు రెవెన్యూ అధికారులే సమాధానం చెప్పాలని బాధితులు కోరుతున్నారు. మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని, కలెక్టర్‌ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో వాస్తవాలు బయట పడతాయని ఆశిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:21 AM