Share News

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:26 AM

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ చేసే ఐటీ ఉద్యోగులకు.. ఇకపై ఆహ్లాదకర వాతావరణం మధ్య పార్కుల్లో నుంచి తమ విధులు నిర్వహించే అవకాశం లభించనుంది.

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!
G Srijana CMC Commissioner

  • ఐటీ ఉద్యోగులు పార్కుల్లో పనిచేసుకునేలా ఏర్పాటు

  • వైఫై, వర్కింగ్‌ డెస్క్‌లు, చార్జింగ్‌ సదుపాయాల కల్పన

  • సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరికొత్త కార్యక్రమం

  • నిర్వహణ కోసం నామమాత్రపు ఫీజు వసూలు

  • సంక్రాంతి నాటికి 300 కొత్త పార్కులు అందుబాటులోకి

  • మీడియా సమావేశంలో సీఎంసీ కమిషనర్‌ సృజన వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి 7 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ చేసే ఐటీ ఉద్యోగులకు.. ఇకపై ఆహ్లాదకర వాతావరణం మధ్య పార్కుల్లో నుంచి తమ విధులు నిర్వహించే అవకాశం లభించనుంది. ఇందుకోసం ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎంసీ కమిషనర్‌ జి.సృజన తెలిపారు. నగర అభివృద్ధికి చేపట్టనున్న సరికొత్త కార్యక్రమాల్లో భాగంగా దీనిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సైబరాబాద్‌ పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు ఖాళీ స్థలాలను ప్రజోపయోగకరంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న వర్క్‌ ఫ్రమ్‌ హోం సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ఈ వినూత్న ఆలోచనకు సీఎంసీ రూపకల్పన చేసిందన్నారు.


వారంతా ఇళ్లకే పరిమితమై పనిచేయకుండా ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వహించుకునేలా ‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సాధారణంగా పార్కులను ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, వ్యాయామం కోసం వినియోగిస్తుంటారని, మిగిలిన సమయాల్లోనూ వాటిని సద్వినియోగం చేసుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మాదాపూర్‌ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద రెండు చోట్ల ఈ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పార్కుల్లో ఉద్యోగులు ల్యాప్‌టా్‌పలతో కూర్చుని పనిచేసుకునేందుకు ప్రత్యేక వర్కింగ్‌ డెస్క్‌లు, ఫిక్స్‌డ్‌ చైర్లు, ల్యాప్‌టాప్‌ చార్జింగ్‌ పాయింట్లు, హైస్పీడ్‌ వైఫై సదుపాయాలు కల్పించనున్నట్లు వివరింంచారు.


భద్రత కోసం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతోపాటు అల్పాహారం, పానీయాల కోసం కియోస్క్‌ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటి నిర్వహణ ఖర్చుల కోసం నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని భావిస్తున్నామని, పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే రోజుల్లో 30 నుంచి 40 పార్కులకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తామని అన్నారు. ఇక సైబరాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 770 ఖాళీ స్థలాలు ఉండగా, ఇప్పటికే 300 స్థలాలకు ప్రహరీ నిర్మించామని వెల్లడించారు. వీటిని సంక్రాంతి నాటికి పూర్తిస్థాయి పార్కులుగా అభివృద్ధి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మిగిలిన 470 ఖాళీ స్థలాలు ఆక్రమణలు జరగకుండా రక్షణగా ప్రహరీ నిర్మించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:26 AM