Share News

రంగంలోకి రేవంత్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:46 AM

సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సాధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

రంగంలోకి రేవంత్‌
Revanth Reddy

  • సమ్మక్కసాగర్‌కు ఎన్‌వోసీ కోసం నేడు ఛత్తీస్‌గఢ్‌కు ముఖ్యమంత్రి

  • మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఆ రాష్ట్ర సీఎంతో భేటీ

  • ఇప్పటికే నయా రాయ్‌పూర్‌కు అధికారులు

  • ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌వోసీ ఇస్తే సీడబ్ల్యూసీ

  • అనుమతుల కోసం మరోసారి డీపీఆర్‌ దాఖలు

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సాధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి నయా రాయ్‌పూర్‌కు వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌తో సమావేశం కానున్నారు. వాస్తవానికి సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీలోని అంతర్రాష్ట్ర విభాగం మినహా.. అన్ని డైరెక్టరేట్లు ఇప్పటికే క్లియరెన్సులు ఇచ్చాయి.


కేవలం ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకుంటే ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌ ఇస్తామని సీడబ్ల్యూసీ ఇదివరకే తేల్చిచెప్పింది. దాంతో 2023 డిసెంబరులో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు అనుమతులపై దృష్టి పెట్టింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓసారి స్వయంగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌ను కలుసుకొని చర్చించారు. ఆ తర్వాత రెండుసార్లు హైదరాబాద్‌, న్యూఢిల్లీలో కూడా ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ముంపుపై అధ్యయనానికి నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చింది. ఆ అధ్యయన నివేదిక వచ్చాక.. ముంపు ఏ మేరకు ఉంటుందనే దానిపై అంచ నాలు రూపొందించి భూములకు గరిష్ఠ పరిహారం చెల్లిస్తామని ఛత్తీస్‌గఢ్‌కు హామీ ఇచ్చింది. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం రేవంత్‌,ఉత్తమ్‌ పలుమార్లు సమావేశమై వినతిపత్రాలు సమర్పించారు. తాజాగా ఈ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్‌ రంగంలోకి దిగారు.


ముంపుపై వచ్చిన స్పష్టత..

సమ్మక్కసాగర్‌ బ్యారేజీతో ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకునే ముంపుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖరగ్‌పూర్‌ ఐఐటీతో అధ్యయనం చేయించగా.. బ్యారేజీ వద్ద 87 మీటర్ల గరిష్ఠ వరదతో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ 83 మీటర్లు కాగా... అక్కడిదాకా ముంపునకు గురయ్యే భూములకే పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే తేల్చిచెప్పింది. అయితే గరిష్ఠ వరద 2022 జూలై 17, 19వ తేదీల్లో 88 మీటర్ల దాకా రికార్డయిందని, ఆ మేరకు ముంపునకు గురయ్యే భూములకు కూడా పరిహారం చెల్లించాలని ఛత్తీస్‌గఢ్‌ పట్టుబట్టింది. తాజాగా ఐఐటీ-ఖరగ్‌పూర్‌తో చేయించిన అధ్యయనంతో ముంపు 100 ఎకరాలుగా స్పష్టత వచ్చింది. తెలంగాణ విజ్ఞప్తితో ఛత్తీస్‌గఢ్‌ అధికారులు బ్యారేజీని 2023 సెప్టెంబరు 6-9వ తేదీల్లో పరిశీలించారు. ఆ తర్వాత సర్వే చేసి, ముంపునకు గురయ్యే ప్రాంతాలను సత్వరం గుర్తించి, భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ను తెలంగాణ అధికారులు కోరారు.


సానుకూల సంకేతాలు..

రూ.9,257 కోట్లతో చేపట్టిన తుపాకులగూడెం బ్యారేజీలో 95 శాతం మేర పనులు కూడా పూరయ్యాయి. ఈ బ్యారేజీలో నీటిని నిల్వ చేసి.. బ్యాక్‌వాటర్‌ను దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయడం ద్వారా పూర్వ ఖమ్మం, న ల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయి తే గత ప్రభుత్వంలో రాజకీయంగా ఎన్‌వోసీ కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగుతుండటంతో ప్రాజెక్టు ఎన్‌వోసీపై సానుకూల సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారుల బృందం ఇప్పటికే నయా రాయ్‌పూర్‌కు చేరుకుంది. కాగా, 2011లో 10 శాతం కమాండ్‌ ఏరియాను మాత్రమే ధ్రువీకరించి, ఈ ప్రాజె క్టు డీపీఆర్‌ను దాఖలు చేశారు. నీటిపారుదల శాఖ సమర్పించిన సీడీవో (సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌) సర్టిఫికెట్‌పై సీడబ్ల్య్యూసీ తాజాగా అభ్యంతరం తెలుపుతూ డీపీఆర్‌ను ఇటీవలే వెనక్కి పంపించింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో కీలకమైన ఆయకట్టు స్థిరీకరణపై సీడబ్ల్యూసీ చాలా రోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఆయకట్టుపై పూర్తి స్పష్టత రావడంతో ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకొని.. మళ్లీ డీపీఆర్‌ దాఖలు చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 03:50 AM