మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:54 AM
మియాపూర్ 550 ఎకరాల భూమి సహా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఐఎంజీ భారత్ భూములతో పాటు సుమారు రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను తమ ప్రభుత్వం కాపాడిందని తెలిపారు.
కోట్ల రూపాయల నగదు ముట్టజెప్పారు
50 వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టేందుకు కేసీఆర్ అండ్ కో కుట్ర
మూడేళ్లలో వాళ్ల కబంద హస్తాల్లోని లక్షన్నర కోట్ల భూములను రక్షించాం
పోలవరం-బనకచర్లకు ఆద్యుడు కేసీఆరే
కేటీఆర్ చెప్పడంతోనే మెట్రో, బుల్లెట్ రైలుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బ్రేకులు
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మా అభ్యర్థి దానం నాగేందరే
కేసీఆర్ కుటుంబం బయటకు విడిపోయినట్లు నటించినా లోపల ఒక్కటే
మీడియా సమావేశంలో, ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులు, పెట్టుబడిదారులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. ఈ కుట్ర వెనక ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడికి చెందిన ‘ట్రినిటీ ఇన్ర్ఫా’ సంస్థ పేరు మీద ఖరీదైన బెంజ్ ఎస్ క్లాస్ కారును కొనుగోలు చేసి ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దామోదర్ రావుకు నజరానాగా ఇచ్చారు. కేసీఆర్‌కు కోట్ల రూపాయల నగదు ముట్టజెప్పారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, దామోదర్ రావు కలిసి గోల్డ్ స్టోన్ ప్రసాద్‌ను అడ్డు పెట్టుకొని రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు. రికార్డులను తారుమారు చేసి, అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ భూములను భూకబ్జాదారులకు కట్టబెట్టేందుకు అనేక ఎత్తుగడలు వేశారని మండిపడ్డారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం మీడియా సమావేశంలోనూ, ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం సాగించిన భూ ఆక్రమణలపై కాంగ్రెస్ తరఫున తీవ్ర పోరాటం చేశామని గుర్తు చేశారు. కక్షపూరితంగా తమపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినా వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పోరాడారని స్పష్టం చేశారు.
లక్షన్నర కోట్ల భూములను రక్షించాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల్లోని దాదాపు రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం, అనుచరులు సాగించిన భారీ భూ దోపిడీని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ‘‘మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిపై సర్వహక్కులూ ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులు జస్టిస్ సుందరేశ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలకు తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని వ్యాఖ్యానించారు. ఇకనైనా భూ కబ్జాలు మానెయ్యాలని కేసీఆర్ తన బృందానికి చెప్పాలని హితవు పలికారు.
ఐఎంజీ భరత్ సహా వేల కోట్ల భూముల రక్షణ
గతంలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలు కలిపి మొత్తం 850 ఎకరాలను ఐఎంజీ భరత సంస్థకు కేటాయించగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దానిని రద్దు చేశారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి కోర్టులో వారికి అనుకూలంగా వ్యవహరించిందని, తాము అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టులో పోరాడి రూ.40 వేల కోట్ల విలువైన ఆ భూమిని కాపాడామని స్పష్టం చేశారు. గడిచిన మూడేళ్లలో ప్రధానమైన ఏడు భూములను కేసీఆర్, కుటుంబ సభ్యులు, కబ్జాదారుల నుంచి రక్షించామని తెలిపారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూమి వాటిలో ఒకటని చెప్పారు. న్యాయస్థానంలో సమర్థ వాదనలు వినిపించడం ద్వారా ఐఎంజీ భారత్ భూములను కాపాడామని చెప్పారు. అలాగే, హయత్ నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్ సర్వే నెం. 201లో 140 ఎకరాల భూమిని కాపాడామని గుర్తు చేశారు.
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నెం. 59లోని 36 ఎకరాల (దాదాపు రూ. 3,600 కోట్ల విలువైన) భూమిని న్యాయస్థానంలో పోరాటం చేసి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గండిపేట మండలం మంచిరేవులలో 143 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామన్నారు. భూపాలపల్లి జిల్లాలో రూ.400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూమిని ఒక రాజకీయ నాయకుడికి నజరానాగా అప్పగిేస్త, సుప్రీంకోర్టులో పోరాడి దానిని కాపాడామని వివరించారు. కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల అటవీ భూమిని రక్షించామన్నారు. ఈ భూములను అమ్మి, ఆ నిధులను నూరు శాతం ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగిస్తామని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడం కోసం ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు.
పోలవరం-బనకచర్లకు ఆద్యుడు కేసీఆరే
‘‘గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం మళ్లించుకుంటోందని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని కేటీఆర్, హరీశ్ అనడం వాళ్ల అవివేకానికి నిదర్శనం. ఏ రాజకీయ నేత అయినా తన రాష్ట్ర ప్రయోజనాలను, తన రాజకీయ భవిష్యత్తును పక్కనబెట్టి, పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారా? భద్రాచలం దిగువన లభించే గోదావరి జలాలను మళ్లించుకునేలా పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే! అసెంబ్లీ సాక్షిగా.. భద్రాచలం దిగువన ఉన్న మిగులు నీటిని వాడుకోమని ఉచిత సలహా చంద్రబాబుకు ఇచ్చింది ఆయనే’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు.
‘‘2630 టీఎంసీల్లో 630 టీఎంసీలు వాడితే అదే ఎక్కువ. అప్పటికీ 2000 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడికి చెప్పాను. ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ, పోలవరం ప్రాజెక్టుతోపాటు మరో ప్రాజెక్టు కట్టుకోండి. తెలంగాణ ఎంత వాడినా దుమ్ముగూడెం వరకే. కిందికిపోయిన నీళ్లు సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసే నీళ్లను మన తెలుగు బిడ్డల కోసం వినియోగించాలని చెప్పా. రాయలసీమకు కూడా నీటిని తరలించుకోవాలని చెప్పాను. గోదావరి, కృష్ణాలో నీటి లభ్యత ఉంది. మాకేం అభ్యంతరం లేదని చెప్పాను. నీటిని వినియోగించుకోవాలని సూచించాను. వీటిని మరోసారి పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్న కేసీఆర్ ప్రసంగాన్ని మీడియా ప్రతినిధులకు వినిపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అక్కడే ఈ వీడియో వినిపించి నిలదీద్దామని అనుకున్నానని, రాకుండా ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు లేని ఆలోచనను చెప్పి, పోలవరం- బనకచర్ల సలహా ఇచ్చి, కాంట్రాక్టర్‌ను కూడా అక్కడికి పంపించి, టెండర్లన్నీ మాట్లాడుకోవాలని చెప్పింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే పదేళ్లు దానిని గాలికొదిలేశారని ఆరోపించారు.
‘‘గత ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి చేసుకున్న ఒప్పందంలో పలు ఉల్లంఘనలు ఉన్నాయని ఫడణవీస్ అన్నారు. తెలంగాణ ప్రతిపాదించిన భూ సేకరణ తదనంతరం తమ పరిశీలనలో మరింత పెరిగిందని చెప్పారు. ముంపు భూములకు పరిహారాన్ని గత ప్రభుత్వం చెల్లించలేదు. ఒప్పందాల అమల్లో తెలంగాణ ట్రాక్ రికార్డు సరిగా లేదని ఫడణవీస్ అన్నారు. గత ప్రభుత్వం సమర్పించిన వివరాలు తప్పులతడకగా ఉన్నందున, ముంపు భూములపై తామే సొంతంగా సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఆ నివేదికలు సిద్ధమయ్యాక.. ఎనిమిది వారాల తర్వాత మరోసారి సమావేశం అవుదామని చెప్పారు’’ అని వివరించారు. మహారాష్ట్ర అంగీకారం లభించాక గోదావరి నీటిని నేరుగా ఎల్లంపల్లికి తరలించాలా? లేక సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి పంపించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంపదతో నిర్మించిన బ్యారేజీలను దెబ్బతినకుండా కాపాడుకోవడానికి తగిన మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువును సృష్టిస్తోందన్న కేటీఆర్, హరీశ్ రావులవి మెదడు లేని మాటలని దుయ్యబట్టారు. తలా తోకా లేకుండా ఎడ్డి మడ్డిగా వాళ్లు చేసిన తప్పులను తమ ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని విమర్శించారు.
కేటీఆర్ చెబితే మెట్రోకు అశ్వినీ వైష్ణవ్ బ్రేకులు
‘‘బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణకు ఏదైనా కావాలని మేం కేంద్ర మంత్రులను కలిస్తే.. వెంటనే కేటీఆర్ వెళ్లి అడ్డుకుంటున్నారు. ‘‘మెట్రో విస్తరణను అడ్డుకున్నది కేటీఆరే. మెట్రో విస్తరణ చేపట్టలేమని ఎల్ అండ్ టీ చెప్పింది. అందుకే, మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది. ఎల్ అండ్ టీతో అగ్రిమెంట్ చేసుకున్నాం. తర్వాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిస్తే అంతా ఓకే అన్నారు. వెంటనే కేటీఆర్ ఢిల్లీకి వచ్చి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కేంద్రం ఏవో కొర్రీలు పెడుతోంది. సాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది. బుల్లెట్ రైలు పరిస్థితీ ఇదే. కేటీఆర్ చెప్పడంతోనే అశ్వినీ వైష్ణవ్ ఆ ప్రాజెక్టుకు బ్రేకులు వేశారు’’ అని ఆరోపించారు.
ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందరే
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో దానం నాగేందరే తమ అభ్యర్థి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ రానిచ్చేది లేదని ఉద్ఘాటించారు.
కేసీఆర్ కుటుంబానికి ప్రకృతి విధించే శిక్ష తప్పదు
కేసీఆర్ హయాంలో జరిగిన అరాచకాలు, పాపాలే వారిని వెంటాడుతున్నాయని, ప్రకృతి సైతం వారి ఓటమికి తగిన రీతిలోనే వ్యవహరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా పైకి విడిపోయినట్లు నటించినా లోపల ఒక్కటేనని వ్యాఖ్యానించారు. దొంగ దెబ్బ తీసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నవారు చరిత్రలో నామరూపాలు లేకుండా పోయారని, రాజకీయాల్లో ఎందరికో ద్రోహం చేసిన కేసీఆర్ కుటుంబానికి భవిష్యత్తులో ప్రకృతి విధించే శిక్ష తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎంతో మందిని వాడుకొని మోసం చేశారని ధ్వజమెత్తారు.
‘‘కేసీఆర్‌కు ఉన్న అసలు ఆస్తి ఎకరం 36 గుంటలే. మా నాన్న, తాత, ముత్తాత పోలీస్ పటేళ్లు. మా ఊళ్లో మేము మోతుబరులమే. అక్కడ ఎవరిని అడిగినా మా గురించి ఇదే చెబుతారు. కోకాపేట ఏరియాలో 2000లోనే నేను గేటెడ్ కమ్యూనిటీలు కట్టాను. నా పరిస్థితి ఏమిటో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు. నేను ఉన్న ఈ స్థాయి ఎవరూ దాన ధర్మం చేస్తే రాలేదు. నేను శ్రమించి, కష్టించి ఈ స్థాయికి చేరుకున్నాను’’ అని వివరించారు.
ఎర్రవల్లిలో శ్రీకాంతాచారి పేరిట అమరవీరుల కాలనీ
ఎర్రవల్లి వద్ద తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి పేరిట అమరవీరుల కాలనీ నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల సర్వేలు కొనసాగుతున్నాయని, ఆక్రమణలను తేల్చి భూములు లేని పేద రైతులకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. డిసెంబరు 9లోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలపకుండా జర్నలిస్టులకు వేరుగా భూమిని గుర్తించి, లే అవుట్‌లను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయించాలన్న దానిపై జర్నలిస్టులతో చర్చించాలని మంత్రికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
కరవును చంద్రబాబు బాగా మేనేజ్ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News