తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: రామచంద్రరావు
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:34 PM
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనపై డీజీపీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన.. హిందూ కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని(DGP Shivadhar Reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు (Ramachandra Rao) ఈరోజు(బుధవారం) కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి, నిమాజాబాద్ జిల్లాల్లో జరిగిన ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిరోజుల క్రితం బాన్సువాడలో ఎంఐఎం నేతలు ఆందోళనలు సృష్టించారని తెలిపారు. ఈ ఘటనపై నిరసన తెలిపిన హిందూ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. దాదాపు 27 మంది హిందూ యువకులను జైలుకు పంపారని తెలిపారు. హిందూ కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రామచంద్రరావు మండిపడ్డారు.
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు దాడి చేసేందుకు యత్నించారని ఆయన అన్నారు. నిజామాబాద్‌లో అడ్వకేట్ కళ్యాణిపై ఎంఐఎం నేతలు దాడి చేశారని ఆరోపించారు. ‘నామ్ కే వాస్తే’ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని రామచంద్రరావు మండిపడ్డారు.
హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని రామచంద్రరావు తెలిపారు. చాంద్రాయణ గుట్ట, ముత్యాలమ్మ గుడి, సికింద్రాబాద్‌లో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. వీటిని ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం వద్దే హోం శాఖ ఉందని.. తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. పోలీసులు అరెస్ట్ చేసిన హిందూ యువకులను వెంటనే విడుదల చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
యూట్యూబర్ అన్వేష్‌పై లుక్‌అవుట్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News