సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:51 PM
ఏపీ శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ శాసనమండలిలో ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలుపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నలు లేవనెత్తారు. ‘ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు.. ఇచ్చే ఉద్దేశం ఉందా’ అని ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ప్రశ్నించారు. జూన్ 2024 నుంచే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి గుర్తుచేశారు. సభ్యుల ప్రశ్నలకు ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) సమాధానం ఇచ్చారు.
ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల పింఛన్ల మొత్తాన్ని పెంచిందని మంత్రి వివరించారు. వృద్ధాప్య పింఛన్లను 3 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచామని, ఏడాదికి రూ.33 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.
మంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పలు స్కీమ్‌లలో జరిగిన లోపాలను మంత్రి శ్రీనివాస్ చెబుతున్నారని తెలిపారు. చివరకు.. అధికార, విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చినట్లుగా ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
రాజమహేంద్రవరం ఘటన.. పాల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు
క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News