రోడ్లు.. తాగునీటికి నిధులివ్వండి
ABN , Publish Date - Feb 25 , 2026 | 10:53 AM
తమ నియోజకవర్గంలో తాగునీరు, రోడ్డు సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు.
డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే పరిటాల సునీత వినతి
అనంతపురం: తమ నియోజకవర్గంలో తాగునీరు, రోడ్డు సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. వెలగపూడి సచివాలయంలోని ఆయన చాంబర్‌లో మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతపురం రూరల్ మండలంలో 27 గ్రామాలు, ఆత్మకూరు మండలంలోని 25 గ్రామాలకు సమగ్ర నీటి పథకాల కోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
అనంతపురం రూరల్ మండలంలోని 12 గ్రామాలు, రాప్తాడు మండలంలోని 26 గ్రామాలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అనంతపురం రూరల్‌లో ఎస్‌ఎస్ ట్యాంకులు, పైపులైన్‌ల మరమ్మతు, 2 ఎంఎల్‌డీస్లో సాండ్(ఎస్ఎస్) ఫిల్టర్ స్థానంలో 6 ఎంఎల్‌డీ రాపిడ్ సాండ్ ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి రూ.55 కోట్లు అవసరమని అన్నారు. రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని అన్ని గ్రామాలకు తాగునీటి అవసరాలకు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకం నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లోని రోడ్లు దయనీయంగా ఉన్నాయని, పునర్నిర్మాణం కోసం రూ.11.50 కోట్లు ఇవ్వాలని కోరారు. నిధుల మంజూరుకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
అభివృద్ధి పనులు, సమస్యలపై..
అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేశ్‌ను ఎమ్మెల్యే కలిశారు. ఆత్మకూరు జూనియర్ కళాశాలలో ఆడిటోరియం, ప్రహరీ నిర్మాణానికి రూ.60 లక్షలు ఇవ్వాలని కోరారు. మండలంలో ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉందని, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల మంజూరు చేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న నసనకోటలో ఎంజేపీ బాలికల గురుకుల జూనియర్ కళాశాల ఫైల్ క్లియర్ చేయాలని కోరారు. రామగిరి జూనియర్ కళాశాలకు హాస్టల్ మంజూరు చేయాలని, భవన నిర్మాణానికి రూ. 2.50 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కనగానపల్లి, చెన్నేకొత్తపల్లిలో అసంపూర్తిగా ఉన్న స్పోర్ట్స్ స్టేడియాలను పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని మంత్రి మండ్లి రాంప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసిన ఆమె, అనంతపురం బైపాస్ - కనగానపల్లి రోడ్డుకు రూ.30 కోట్లు, కనగానపల్లి-చిగరచెట్టు రోడ్డుకు రూ.20 కోట్లు, ధర్మవరం-కళ్యాణదుర్గం రోడ్లకు రూ.22 కోట్లు, అనంతపురం-చిగిచెర్ల రోడ్డుకు రూ.18 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మంత్రులు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీకాకుళంలో అదుపులోకి డయేరియా.. మంత్రి నారాయణ సమీక్ష
జగన్ కోసం ‘ఆత్మాహుతి దళం’ అవుతాం: ధర్మాన కృష్ణదాసు
Read Latest Telangana News and National News