కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మృతిపై ఎన్‌హెచ్‌ఆర్సీ కేసు
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:18 AM
కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో రెండు నెలల పసికందు మృతి చెందిందనే వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్( ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది.
న్యూఢిల్లీ, హైదరాబాద్, కందనూలు/నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో రెండు నెలల పసికందు మృతి చెందిందనే వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్( ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. వినోద్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసింది. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి సంబంధిత ఆధారాలను అందజేసినట్లు న్యాయవాది వినోద్ తెలిపారు. ఇక, కుమ్మెర గ్రామ శివాలయంలో జరిగిన ఘటనలో రెండు నెలల చిన్నారి బలికావడం విషాదకరమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు జరిగితే వాటిని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఆయన మంగళవారం కుమ్మెర గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించిన బీసీ కమిషన్ చైర్మన్.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.