శ్రీకాకుళంలో అదుపులోకి డయేరియా.. మంత్రి నారాయణ సమీక్ష
ABN , Publish Date - Feb 25 , 2026 | 10:02 AM
శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో దీనిపై జిల్లా అధికారులతోపాటు మున్సిపల్ ఉన్నతాధికారులతో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ బుధవారం సమీక్ష నిర్వహించారు.
అమరావతి, ఫిబ్రవరి 25: శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతోపాటు మున్సిపల్ ఉన్నతాధికారులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ బుధవారం సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారికి మంత్రి ఆదేశించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేయాలని సూచించారు. అదనపు సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని ఉన్నతాధికారులకు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
మరోవైపు శ్రీకాకుళం నగరంలో డయేరియా కేసులు అదుపులోకి వచ్చాయి. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సప్నల్ దినకర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పర్యటించారు. ఇక 50 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏఎన్ఎంలతోపాటు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు.
ఈ డయేరియా ప్రభావిత ప్రాంతంలో మున్సిపల్ కుళాయి నీటి సరఫరాను మంత్రి ఆదేశాలతో అధికారులు నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లోని నీటి నమూనాలను ఇప్పటికే శ్రీకాకుళం, వైజాగ్ ల్యాబ్‌లకు పంపారు. అందుకు సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది.
ఇటీవల శ్రీకాకుళం నగరంలో రహదారి మరమ్మతులు నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతంలో డయేరియా ప్రబలిందని అధికారులు గుర్తించారు. కలుషిత నీరు, నిల్వ చేసిన ఆహారం వల్లే ఈ వ్యాధి ప్రబలినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఇంకోవైపు వాటర్ పైపు లైన్లు లీకేజీలను గుర్తించేందుకు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలతోపాటు పారిశుద్ధ్యానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రుళ్లు సైతం ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితుల కోసం జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన వారి వైద్య ఖర్చులను తామే భరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and National News