వేళకు రావు.. స్టాపుల్లో ఆగవు
ABN , Publish Date - Feb 25 , 2026 | 08:00 AM
నగరంలో వేళకు సిటీ బస్సులు రాక, వచ్చినా అవి బస్టాపుల్లో ఆగక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం బస్టాపుల్లో పడిగాపులు కాస్తూ.. వచ్చిన అరకొర బస్సుల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణాలు సాగిస్తున్నారు.
సిటీలో అరకొరగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు
రద్దీసమయాల్లో తప్పని కష్టాలు.. ‘మహాలక్ష్మి’తో రద్దీ మూడింతలు
అవసరమైన బస్సులు 7 వేలు, ఉన్నవి 3,200
రోజు వారీ ప్రయాణికులు 24 లక్షలు.. వారిలో 17.5 లక్షలు మహిళలే
హైదరాబాద్ సిటీ: నగరంలో వేళకు సిటీ బస్సులు రాక, వచ్చినా అవి బస్టాపుల్లో ఆగక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం బస్టాపుల్లో పడిగాపులు కాస్తూ.. వచ్చిన అరకొర బస్సుల్లో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణాలు సాగిస్తున్నారు. రద్దీ రూట్లలో వాటిసంఖ్య తక్కువగా ఉండటం, కొంతమంది డ్రైవర్లు బస్టాపులకు దూరంగా బస్సులు నిలపడంతో ప్రయాణికులు రోడ్లపై పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా వాహనాల మధ్య చిక్కుకుని చిన్నచిన్న ప్రమాదాలకు గురవుతున్నారు.
మూడింతలు పెరిగిన మహిళల రద్దీ
మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో సిటీ బస్సుల్లో మహిళల రద్దీ మూడింతలు పెరిగింది. గ్రేటర్‌జోన్‌లో 3,200 ఆర్టీసీ బస్సుల్లో రోజూ 24లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 17.5లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. గచ్చిబౌలి, రాయదుర్గం, ఈసీఐఎల్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట(Ameerpet), ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్ క్రాస్‌రోడ్, మెహిదీపట్నం, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఉదయం పూట రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రయాణికుల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు రద్దీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు. అయితే కొంతకాలంగా అలాంటి పరిస్థితులు నగరంలో లేకుండా పోయాయి.
ట్రాఫిక్‌తో తగ్గుతున్న ట్రిప్పులు..
గ్రేటర్‌లో ప్రతీ రోజు 35 నుంచి 36 వేల బస్‌ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రధాన రహదారులు కనీసం ఓ ఐదు కిలోమీటర్లు సమాన వెడల్పుతో లేకపోవడంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయని బస్ డ్రైవర్లు చెబుతున్నారు. ఇలా ఎక్కువ సమయం ట్రాఫిక్‌లోనే నిలిచిపోతుండటంతో బస్సుల ట్రిప్పులు తగ్గిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు.

గ్రేటర్‌లో జోన్ వివరాలు..
గ్రేటర్‌లో మొత్తం ఆర్టీసీ బస్సులు - 3,200
డీజిల్ అద్దె బస్సులు - 268
ప్రైవేట్ కళాశాలల కోసం ప్రత్యేకంగా ఉదయం నడిపే బస్సులు - 75
ఈఎస్ఐ, బీహెచ్‌ఈఎల్ కోసం నడిపే బస్సులు- 37
మహిళా ఉద్యోగులకు కోసం నడిపే బస్సులు - 96
బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య - 24 లక్షలు
మహిళా ప్రయాణికులు - 17.5 లక్షలు
రజూ తిరుగుతున్న బస్సుల ట్రిప్పులు - 35-36 వేల ట్రిప్పులు
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News