దేవుడు క్షమించడు!
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:10 AM
దేవదేవుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పవిత్రతను, సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర: సీఎం
కల్తీ నెయ్యి.. వ్యవస్థీకృత సిండికేట్ నేరమే
చుక్కపాలు సేకరించని సంస్థలకు నెయ్యి టెండర్లు
రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారీ
జంతు కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ నివేదిక
దాని ఆధారంగానే నేను, పవన్ మాట్లాడాం
2022లోనే కల్తీ వెలుగులోకి
సీఎ్‌ఫటీఆర్‌ఐ నివేదికను తొక్కిపెట్టిన సుబ్బారెడ్డి
వైఎస్ నాటి నుంచే తిరుమలలో అపచారాలు
శ్రీవారికి ఉన్నది రెండు కొండలేనంటూ 2005 సెప్టెంబరు 16న జీవో 338 జారీ
నాడు నేను రద్దుచేయాలన్నది 338నే
కానీ జగన్ అబద్ధాలు చెబుతున్నారు
ఆయన హయాంలో ప్రణాళిక ప్రకారమే ఆలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం
పాపాలు దాచేందుకే హెరిటేజ్‌పై దుష్ప్రచారం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం
తిరుమలకు వెళ్లే అన్యమతస్థులు శ్రీవారిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం చేయలేదు? డిక్లరేషన్‌పై క్యాన్సిల్ అని నమోదుచేసి దౌర్జన్యంగా వెళ్లారు. అధికారం ఉందన్న అహంభావంతో ప్రవర్తించారు.
- సీఎం చంద్రబాబు
కల్తీ జరిగిందని టీటీడీ చైర్మన్‌గా పనిచేసినవారే (వైవీ సుబ్బారెడ్డి) అంగీకరించారు. కానీ జగన్ ఆయన్ను వెనకేసుకురావడం ఏమిటి? ఏమీ జరగలేద ంటూ.. రివర్స్‌లో మేమే క్షమాపణ చెప్పాలంటారా? - సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): దేవదేవుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పవిత్రతను, సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ దిశగా ఓ వ్యవస్థీకృత సిండికేట్ దారుణ నేరాలకు పాల్పడిందని, ఇందులో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ఒకటని చెప్పారు. ఒకవైపు కల్తీనెయ్యి సరఫరా.. మరోవైపు అన్యమతప్రచారం.. ఇంకోవైపు హిందూమతంపై దాడిచేయడం ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వ్యక్తులను దేవదేవుడు క్షమించడన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణలో అనేక దారుణాలు వెలుగులోకి వచ్చినా.. తప్పుడు పనులు చేసిన వ్యక్తులు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హెరిటేజ్‌పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో కల్తీనెయ్యి, దాని అనంతర పరిణామాలపై సీఎం ప్రసంగించారు. ముఖ్యాంశాలివీ..
కల్తీ వెనక కుట్ర..
2019-24 మధ్య తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ నిబంధనలు మార్చారు. నాణ్యతా ప్రమాణాలు తగ్గించారు. నెయ్యి సరఫరా చేసే సంస్థ నెలకు కనీసం 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధన ఎత్తివేశారు. వార్షిక టర్నోవర్‌ను రూ.150 కోట్లకు కుదించారు. తాము అనుకున్న కంపెనీలకు టెండర్ కట్టబెట్టేందుకు ముందస్తు కుట్రను అమలు చేశారు. తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ ఉందని 2022లోనే ఫిర్యాదులు వచ్చాయి. నెయ్యి శాంపిళ్లను సీఎ్‌ఫటీఆర్‌ఐ ల్యాబ్‌లో పరీక్షించగా కల్తీ ఉందని రిపోర్టు వచ్చింది. ఈ నివేదికను నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తొక్కిపెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి టీటీడీ ఈవో (శ్యామలరావు) నేషనల్ డెయిరీ డెవల్‌పమెంట్ బోర్డు (ఎన్‌డీబీబీ)-కాఫ్ ల్యాబ్‌లో 2024 జూలైలో రెండు దఫాలుగా పరీక్ష చేయించారు. నెయ్యి కల్తీతోపాటు జంతు మాంసం కొవ్వు అవశేషాలు ఉన్నాయని నివేదిక వచ్చింది. దీని ఆధారంగానే నేను ఎన్డీఏ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశాను. 2019-24 నడుమ తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. రసాయనాలు కలిశాయనే సీబీఐ సిట్ కూడా తేల్చింది. కల్తీ ఘోరం నాటి టీటీడీ చైర్మన్, బోర్డుకు తెలిసే జరిగింది. అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న లంచాలు తీసుకున్నారని.. ఆయన ఖాతాలో రూ.4.5 కోట్లు వచ్చిపడ్డాయని సిట్ తేల్చింది. కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకే నకిలీ సర్టిఫికెట్లతో టెండర్లు దక్కించుకున్నారు. చుక్క పాలు సేకరించని కంపెనీలు వివిధ రసాయనాలతో కల్తీ నెయ్యిని తయారు చేశాయి. దీంతోనే లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేసి ఘోరమైన అపచారం చేశారు. టీటీడీ సాంకేతిక నిపుణులకు ఖరీదైన ఫోన్లు, గిఫ్టులు ఇచ్చారు.
చార్జిషీటులో 35వ పేజీలో ఉంది కదా!
తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో రసాయనాల కల్తీతోపాటు, జంతువుల కొవ్వు కలిసిందని నిగ్గుతేల్చిందే ఎన్‌డీడీబీ-కాఫ్ట్. అయినా జంతువుల కొవ్వు కలవలేదని, కల్తీనే లేదని వైసీసీ నేతలు, మరికొందరు అడ్డగోలుగా వాదిస్తున్నారు. సిట్ చార్జిషీటులో జంతువుల కొవ్వు అనే పదం స్పష్టంగా వాడారు. 35వ పేజీలో ఎన్‌డీడీబీ-కాఫ్ రిపోర్టు ప్రస్తావన ఉంది. దాని ఆధారంగానే నేను, పవన్ లడ్డూ కల్తీపై మాట్లాడాం. జగన్ హయాంలో 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యిని వినియోగించి 20.01 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక తిరుమలలో అన్యమత ప్రచారం జరిగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై పవిత్ర జెరూసలెం యాత్ర అంటూ ముద్రించారు. లేని పింక్ డైమండ్ చోరీ చేశానని నాపైనే తప్పుడు ప్రచారం చేశారు. మేం 100 కోట్ల పరువునష్టం కేసు వేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ కేసు నుంచి టీటీడీ వెనక్కి తగ్గేలా చేసింది. జగన్ టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చారు. 85 మందితో జంబో పాలకమండలిని ఏర్పాటు చేశారు. హైకోర్టు తప్పుపట్టడంతో ఉత్తర్వులు మార్చారు. జగన్ హయాంలో హిందూమతంపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగింది. 2,032 దేవాలయాలపై దాడులు జరిగాయి. 32 విగ్రహాలను ధ్వసం చేశారు. 59 విగ్రహాల చోరీ జరిగింది. అయినా నిందితులపై చర్యలు తీసుకోలేదు. మా హయంలో దేవాలయాలపై దాడులకు పాల్పడితే ఉపేక్షించం.
రాజశేఖరరెడ్డి జమానా నుంచే..
2005లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి జమానా నుంచే హిందువులపై దాడి మొదలైంది. తిరుమల రెండు కొండలేనంటూ 2005 సెప్టెంబరు 16న నాటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శామ్యూల్ జీవో 338 ఇచ్చారు. దీనిపై హిందువుల తిరుగుబాటుతో తిరుమల ఏడు కొండలంటూ 2007 జూలై 2న జీవో 747 ఇచ్చింది. అధికారంలోకి వస్తే ఈ 747 జీవోను రద్దుచేస్తానని నేను చెప్పినట్లుగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను రద్దుచేస్తానన్నది జీవో 338నే. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దేవ సంగీతం అనే వ్యక్తిని ఎస్వీ యూనివర్సిటీ వీసీగా నియమించారు. ఆయన వర్సిటీలో శ్రీవారి ఫొటోలను కూడా తొలగించారు. పద్మావతి వర్సిటీకి వీణా నోబుల్ దాస్ అనే క్రిస్టియన్ మహిళను వీసీగా నియమించారు. ఆమె హయాంలో బలవంతపు మత మార్పిళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వైవీ సుబ్బారెడ్డి సతీమణి చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగేవారు. భూమన కూతురు చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఇలాంటి వారిని టీటీడీ చైర్మన్లుగా ఎలా నియమిస్తారు? ఇకనైనా గత పాలకులు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. హైందవ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ఇతర మతాలవారి మనోభావాలను దెబ్బతీసే అధికారం మరొకరికి లేదు.
నీతి, నిజాయితీతో హెరిటేజ్..
జగన్ హయాంలో ఆయన సొంత సంస్థ భారతి సిమెంట్స్‌కు లబ్ధి చేకూర్చారు. ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ఇతర స్కీములకు భారతి సిమెంట్స్‌కు ఆర్డర్లు ఇచ్చారు. హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. ప్రభుత్వంలో ఎక్కడా దాని ఉత్పత్తులు సరఫరా చేయలేదు. మా సంస్థ నుంచి ఒక్క కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి, నిజాయితీతో హెరిటేజ్ నిలబడింది. పుణేలో ఉన్న ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు నెయ్యి విషయంలో ఏ సంబంధం లేదు. హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదు.
టీటీడీ ప్రక్షాళన చేపట్టాం..
కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాం. లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచాం. భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ ధ్రువీకరణ తర్వాతే లడ్డూ తయారీ పదార్ధాలు కొనుగోలు చేస్తున్నాం. అన్నప్రసాదాల నాణ్యత పెంచాం. క్యూలైన్ల వద్ద 24గంటలూ పాలు అందించేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశాం. భక్తుల రద్దీ నియంత్రణకు కమాండ్ కంట్రోల్ తీసుకొచ్చాం. 60 టీటీడీ దేవాలయాల్లో రూ.700 కోట్లతో అన్నదానం చేపడుతున్నాం. 3.5 ఎకరాల్లో దివ్య ఔషధ వనం ప్రాజెక్టు చేపట్టాం. దేశవ్యాప్తంగా 5వేల దేవాలయాలు నిర్మించాలన్నది ప్రణాళిక. దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో ఆలయాలు నిర్మాణం చేపట్టాలని ఆలోచన. నన్ను అంతమొందించేందుకు అలిపిరి సమీపంలో నక్సల్స్ 23 క్లెమోర్‌మైన్స్ పేల్చినా బతికాను. వేంకటేశ్వరస్వామి పునర్జన్మ ఇచ్చారు. ఈ జీవితం ఆయనిచ్చిన కానుక. నేను బతికి ఉన్నంత వరకు ఆయన పవిత్రతను కాపాడతా. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తా. రోజూ 2నిమిషాలు స్వామిని తలచుకుంటా. ఏ కష్టం, బాధవచ్చినా ఆయన్ను తలచుకుని ముందుకెళ్తా. అదే నా శక్తి. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా క్యూలోనే వెళ్లి స్వామిని దర్శించుకుంటాను. ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే.. నేను ప్రాణదానం ప్రారంభించా.
నిజం చెప్పినందుకు ‘ఆంధ్రజ్యోతి’పై కేసు..
గత పాలకుల హయాంలో టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసు ప్రభువు ఫొటో, శిలువ కూడా కనిపించింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక స్పందించి ‘ఏసయ్య సేవలో టీటీడీ’ అంటూ వార్తను ప్రచురించింది. జరిగిన తప్పును సరిదిద్దుకోకుండా ఆ పత్రికపై రూ.100 కోట్ల పరువునష్టం కేసు వేశారు. ఈ కేసును వాదించడానికి సుబ్రహ్మణ్యస్వామి లాంటి వాళ్లను పిలిపించారు. నిజం చెప్పినందుకు సరిదిద్దుకోకుండా.. పత్రికపై కేసులు పెడతారా?