Share News

యుద్ధం.. సందిగ్ధం!

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:56 AM

ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడికి దిగవచ్చని హెచ్చరిస్తున్న అమెరికా.. వాస్తవంగా యుద్ధంపై తర్జనభర్జన పడుతున్నట్టు కనిపిస్తోంది. యుద్ధంతో చాలా రిస్క్‌ ఉందంటూ అమెరికా రక్షణ ఉన్నతాధికారుల హెచ్చరికలు..

యుద్ధం.. సందిగ్ధం!

  • ఇరాన్‌పై దాడి తప్పదంటూనే అమెరికా తర్జనభర్జన

  • చాలా రిస్క్‌ ఉందని అధ్యక్షుడికి పెంటగాన్‌ సూచనలు!

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడికి దిగవచ్చని హెచ్చరిస్తున్న అమెరికా.. వాస్తవంగా యుద్ధంపై తర్జనభర్జన పడుతున్నట్టు కనిపిస్తోంది. యుద్ధంతో చాలా రిస్క్‌ ఉందంటూ అమెరికా రక్షణ ఉన్నతాధికారుల హెచ్చరికలు.. ఎంత ఒత్తిడి తెచ్చినా, భారీగా సైన్యాన్ని మోహరించినా ఇరాన్‌ ఏమాత్రం దిగిరాకపోవడం.. యుద్ధమే మొదలైతే యూఏఈ, ఖతార్‌, బహ్రెయిన్‌ తదితర దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ విరుచుకుపడొచ్చనే అంచనాలు.. మరోవైపు స్విట్జర్లాండ్‌ మధ్యవర్తిత్వంతో జెనీవాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్‌ చర్చలు వంటి పరిణామాలన్నీ ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇరాన్‌పై దాడి చాలా రిస్క్‌!

ఇరాన్‌పై దాడి చేస్తే ప్రమాదకర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. రక్షణశాఖ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ డేన్‌ కెయిన్‌, ఇతర ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా కథనాన్ని ప్రచురించింది. పరిమిత స్థాయిలో దాడుల వల్ల సమస్య ఉండకపోవచ్చని, కానీ ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం అమెరికా సైన్యాలకు గణనీయంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువని వారు పేర్కొన్నట్టు తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ గనుక ఒకేసారి దాడులకు దిగితే ఇబ్బంది తలెత్తుతుందని స్పష్టం చేసినట్టు వెల్లడించింది. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. ఇరాన్‌ దిగివచ్చి ఒప్పందం కుదుర్చుకోకపోతే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. కాగా, అమెరికా ఎన్నడూ లేనంతగా బలగాలను మోహరించినా, అన్ని వైపుల నుంచీ ఒత్తిడి తెచ్చినా ఇరాన్‌ ఎందుకు లొంగిపోవడం లేదంటూ ట్రంప్‌ సందేహం వెలిబుచ్చారని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం. అంతేకాదు ఇరాన్‌ యురేనియం శుద్ధి ప్రక్రియలో అణుబాంబు తయారు చేయడానికి వీలైనస్థాయికి దాదాపుగా చేరుకుందని.. ఇది చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.


ఇరాన్‌కు మద్దతుగా హెజ్బొల్లా?

మరోవైపు స్విట్జర్లాండ్‌ మధ్యవర్తిత్వంతో జెనీవాలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. అణుశుద్ధిని పూర్తిగా నిలిపివేయడం, క్షిపణుల పరిధిని కుదించుకోవాలని అమెరికా డిమాండ్‌ చేస్తుండగా.. ఈ రెండు అంశాలపై వెనక్కి తగ్గేది లేదంటూ ఇరాన్‌ పట్టుబడుతోంది. గురువారం(ఈ నెల 26న) మరో దఫా చర్చలు జరగనున్నాయి. కాగా, ఇరాన్‌పై యుద్ధం చేపడితే అమెరికా స్థావరాలపై దాడి చేసేందుకు ఇరాన్‌ మద్దతున్న హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ సిద్ధమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌కు మద్దతుగా హెజ్బొల్లా దాడులకు దిగితే.. ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్‌ సైన్యాలు లెబనాన్‌పై దాడి చేయవచ్చని ఆ దేశ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఎంతకాలం బతుకుతానో

  • నాపై చాలా మంది తుపాకీలు ఎక్కుపెట్టారు

  • ఇటీవలి హత్యాయత్నాల నేపథ్యంలో ట్రంప్‌

తాను ఎంతకాలం బతుకుతానో తనకే తెలియదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. గతంలో తనపై హత్యాయత్నాలు, ఇటీవల ఆయన ‘మార్‌ ఏ లాగో’ రిసార్టులోకి సాయుధ దుండగుడు చొరబడటం వంటి ఘటనల నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు. చాలా మంది నాపై తుపాకీలు గురిపెట్టారు. కాదంటారా?’’ అని పేర్కొన్నారు. గతంలో తన గోల్ఫ్‌ క్లబ్‌లో గోల్ఫ్‌ ఆడుతుండగా ట్రంప్‌ను కాల్చేందుకు ఒక సాయుధుడు ప్రయత్నించాడు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవికి గాయమైంది కూడా.

ఇరాన్‌కు చైనా నౌకా విధ్వంసక క్షిపణులు!

చైనా నుంచి నౌకా విధ్వంసక క్షిపణుల కొనుగోలు కోసం ఇరాన్‌ జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. చైనాకు చెందిన సీఎం-302 యాంటీ షిప్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కొనుగోలు కోసం ఇరాన్‌ చాలా రోజుల నుంచి చర్చలు జరుపుతోంది. తాజాగా అమెరికా యుద్ధ నౌకల మోహరింపు నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ వేగవంతం చేశారని.. ఒప్పందం దాదాపుగా తుదిదశలో ఉందని అంతర్జాతీయ వార్తసంస్థ రాయిటర్స్‌ తాజా కథనంలో పేర్కొంది. 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణులు.. సముద్ర తలంపై అతి తక్కువ ఎత్తులో, అత్యంత వేగంగా ప్రయాణించగలవని, అదే సమయంలో వేగంగా దిశను మార్చుకోగలవని తెలిపింది. ఈ సామర్థ్యం కారణంగా నౌకల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా దాడి చేయగలదని పేర్కొంది. త్వరలోనే ఈ క్షిపణుల సరఫరా ప్రారంభం కావొచ్చని.. గల్ఫ్‌ సముద్ర ప్రాంతంలో ఇరాన్‌ బలం మరింత పెరుగుతుందని వెల్లడించింది.

Updated Date - Feb 25 , 2026 | 12:56 AM