Share News

రైడ్‌కు వెళ్లి రెక్కీలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 07:29 AM

కోఠిలో ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌ వద్ద కాల్పులు జరిపి.. రూ.6లక్షలు దోపిడీ చేసిన కేసును సిటీ టాస్క్‌ఫోర్స్‌, సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఛేదించారు.

రైడ్‌కు వెళ్లి రెక్కీలు

  • కోఠీ ఏటీఎం దోపిడీ కేసు ఛేదన

  • కాల్పులు, దోపిడీ చేసింది యూపీ ముఠాయే..

  • నిందితులు ఇద్దరు కాదు.. ఏడుగురు

  • ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

  • రూ.2.38 లక్షలు, తుపాకీ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: కోఠిలో ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌ వద్ద కాల్పులు జరిపి.. రూ.6లక్షలు దోపిడీ చేసిన కేసును సిటీ టాస్క్‌ఫోర్స్‌, సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీలో పాల్గొన్నది ఇద్దరు కాదని, మొత్తం ఏడుగురు కలిసి పథకం ప్రకారం దోపిడీ చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. వారిలో ఇద్దరిని సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరిని ఉత్తరాఖండ్‌ పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు. కాగా.. మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నారని, వారికోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారి నుంచి రూ.2.38లక్షల నగదు, ఒక కంట్రీమేడ్‌ తుపాకీ, 35 లైవ్‌ రౌండ్స్‌ బుల్లెట్లు, రెండు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖైరతాబాద్‌ డీసీపీ శిల్పవల్లితో కలిసి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.


నెలరోజులు రెక్కీ..

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌జంగ్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ తయాబ్‌ త్యాగి.. గతేడాది ఫిబ్రవరిలో బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంపాదన సరిపోకపోవడంతో భారీ దోపిడీ చేసి సిటీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా త్యాగి రోజూ ఉదయాన్నే క్యాబ్‌ రైడ్‌కు వెళ్లేవాడు. అబిడ్స్‌, కోఠి, నాంపల్లి ఏరియాల్లోని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని వాటి వద్ద క్యాబ్‌ పెట్టుకొని రెక్కీ చేసేవాడు. ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్‌ చేయడానికి ఎక్కడి ఏటీఎంకు ఎక్కువ మంది వ్యాపారులు వస్తున్నారు.? ఎక్కడ దోపిడీ చేసి పారిపోవాలి..? ఇలా ప్లాన్‌ ప్రకారంగా సుమారు నెలరోజులపాటు రెక్కీ చేశాడు. అనంతరం కోఠిలోని ఏటీఎం సెంటర్‌ వద్దకు ఎక్కువ మంది వ్యాపారులు, ఎక్కువ మొత్తం డబ్బుతో వస్తున్నారని గుర్తించాడు.


  • స్నేహితులను పిలిచి..

కోఠిలో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్న త్యాగి.. విషయాన్ని యూపీలో ఉన్న అంకుల్‌ నౌషద్‌, కజిన్‌ బ్రదర్‌ దనిష్‌ త్యాగికి చెప్పాడు. దాంతో నౌషద్‌ తన స్నేహితులైన ఘరానా దొంగ ఫర్కాన్‌ అహ్మద్‌తో పాటు.. ఫహీమ్‌ అహ్మద్‌, అబిద్‌, మహ్మద్‌ మత్లబ్‌లతో ముఠాను ఏర్పాటు చేశాడు. అందరూ కలిసి తుపాకీతో నగరానికి వచ్చారు. క్యాబ్‌ డ్రైవర్‌ త్యాగి, అబిద్‌లు జనవరి 31న నాంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడి పరిసరాల పరిశీలనలో ఉండగా.. మరో ఇద్దరు ఫర్కాన్‌ అహ్మద్‌, ఫహీమ్‌ అహ్మద్‌లు కోఠిలో ఏటీఎం సెంటర్‌ వద్ద నిఘా పెట్టారు.


అదే సమయంలో క్యాష్‌ డిపాజిట్‌ చేయడానికి బ్యాగుతో వచ్చిన రిన్షాద్‌పై దాడికి పాల్పడి బ్యాగును లాక్కుని ఒక రౌండ్‌ గాల్లో కాల్పులు జరిపి, మరో రౌండ్‌ను బాధితుడికి కాలుపై కాల్చారు. ఆ తర్వాత అతని స్కూటీ తాళాలు లాక్కొని పారిపోయారు. మొదట నింబోలిఅడ్డవైపు వెళ్లి డ్రెస్‌ మార్చుకొని ఆటోలో చంద్రాయణగుట్ట షాహిన్‌ నగర్‌కు వెళ్లి అక్కడ అందరూ కలుసుకొని డబ్బులు లెక్కబెట్టుకొన్నారు. ఒకరికొకరు సంబంధం లేకుండా సిటీ నుంచి పారిపోయారు. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో జాయింట్‌ సీపీ శ్వేత, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పర్యవేక్షణలో సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి.


ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, రంజిత్‌కుమార్‌లు తమ బృందాలతో సుమారు 20 రోజులపాటు గాలించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ఉత్తరాఖండ్‌లో అరెస్టయి జైల్లో ఉన్నారు. వారిని పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొస్తామని డీసీపీ తెలిపారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామన్నారు. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు ఫర్కాన్‌ అహ్మద్‌పై యూపీలో రాబరీ, హత్యాయత్నం, ఫైర్‌ ఆర్మ్‌స్‌ సహా.. 8 కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవుడు క్షమించడు!

రైలు ప్రయాణికులకు రివార్డులు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2026 | 07:29 AM