క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:39 AM
నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎంత వరకు వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని... క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ చేశామన్నారు మంత్రి. అనంతపురం, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒకే రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, ఉపకరణాలు, విడి భాగాలు ఒకే చోట తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి చెప్పారు. దీనికి అవసరమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే తయారవుతున్నాయని అన్నారు.
సంబంధిత ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కంపెనీలను కోరామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశామని తెలిపారు. సెక్టార్ల వారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను గుర్తించి.. ఆ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
సాంకేతికత పెరిగిన ఈ కాలంలో నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరి అని నారా లోకేశ్ అన్నారు. బైక్, కార్ మెకానిక్‌లు కూడా కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. సెయింట్ గోబియాన్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణకు చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు 1,500కు పైగా జాబ్ మేళాలు నిర్వహించి.. 1,08747 మందికి ఉద్యోగాలు కల్పించామని ఆయన తెలిపారు.
వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేలను కోరుతున్నామన్నారు మంత్రి. లిఫ్ట్ మెకానిక్‌ల కొరత ఎక్కువగా ఉందని, ఇలాంటి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమం ద్వారా కుల వృత్తుల్లో ఆధునీకరణ కోసం లక్షా 9 వేల మందికి శిక్షణ అందించామని వివరించారు. క్యాంపస్‌లలో అదనపు కోర్సులు తీసుకొచ్చి కృత్రిమ మేధస్సు (ఏఐ)పై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. స్కిల్ సెన్సెస్‌పై సీఎం, డిప్యూటీ సీఎం సూచనల మేరకు తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని లోకేశ్ చెప్పారు. దీంట్లో సమస్యలు రావడంతో స్కిల్ అసెస్‌మెంట్ కార్యక్రమం చేపట్టి, 'నైపుణ్య' అనే పోర్టల్ రూపొందించామని తెలిపారు. ఈ పోర్టల్‌లో వ్యక్తులు తమ నైపుణ్యాలను స్వయంగా పరీక్షించుకునే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక పోర్టల్ రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఏఐ ట్యూటర్ ద్వారా ఇంటర్వ్యూలకు శిక్షణ ఇస్తున్నామని.. కంపెనీలు, సంస్థలతో ఉద్యోగం అవసరమైన వారిని మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. జర్మన్ భాష నేర్పించడం ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు పొందేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పినా.. మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. జాబ్ మేళాలు మొక్కుబడిగా కాకుండా ప్రభావవంతంగా నిర్వహించాలని.. ఎక్కడ జాబ్ మేళా జరిగినా దానిపై నోట్ పంపిస్తే మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. నాణ్యతతో పని చేసే వారికి డిమాండ్ ఉందని.. అందుకే క్వాలిటీ వర్క్‌పై దృష్టి పెట్టామని లోకేశ్ చెప్పారు. రాబోయే 90 రోజుల్లో నైపుణ్యాభివృద్ధిలో సమూల మార్పులు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి కంపెనీలను ఒప్పించడంలో ఇబ్బందులున్నాయన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయటంపై కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సరైన మెంటార్లు ఉంటేనే ఇంటర్న్‌షిప్ విజయవంతం అవుతుందన్నారు. ‘ఇంటర్న్‌షిప్ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తిగా దాని అవసరం నాకు తెలుసు’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రాజమహేంద్రవరం ఘటన.. పాల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు
Read Latest AP News And Telugu News