ఏపీ ఉభయ సభల్లో నేడు..
ABN , Publish Date - Feb 25 , 2026 | 08:20 AM
సభ్యుల ప్రశ్నోత్తరాలతో ఆంధ్రప్రదేశ్ శాసన సభ, శాసన మండలి ఈ రోజు ప్రారంభం కానుంది.
అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం పదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు తొలుత ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది. ఎమ్మిగనూరులో న్యాయస్థానం, నెల్లిమర్లలో విద్యుత్ సరఫరా సమస్యలు, రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీలోని ఇళ్లకు మరమ్మతులతోపాటు తోటపల్లి - మద్దువలస కాలువ పనులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు, వసతి గృహాలలో కలుషిత ఆహార ఘటనలు, అనంతపురంలో టెక్సటైల్ పార్క్, వశిష్ట గోదావరిపై పిచ్చింగ్ ప్లాట్‌ఫామ్ నిర్మాణం, యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మైనర్ బాలికల మిస్సింగ్ కేసులుపై నేడు సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు.
ఇక 2024 - 25 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ సంస్థ లిమిటెడ్‌కు సంబంధించిన 10వ వార్షిక నివేదికను సభ ముందు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ఉంచనున్నారు.
2020 - 21 సంవత్సరానికి గాను తిరుపతి పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ వార్షిక లెక్కలను సభ ముందు మంత్రి ఉంచనున్నారు.
రహదారులు, భవనాలు, రవాణా, దేవాదాయ శాఖలు, పరిపాలన, ఎన్నికల నిర్వహణ కోసం జీఏడి, విత్తపాలన, ప్రణాళిక, సర్వేలు, గణాంకాలు, రాష్ట్ర శాసన వ్యవస్ధ కోసం గ్రాంట్ల అభ్యర్ధనపై చర్చ, ఓటింగ్ కోసం మంత్రులు పలు ప్రతిపాదనలు చేయనున్నారు.
శాసన మండలిలో..
ఏపీ శాసన మండలిలో వ్యవసాయ రంగంపై బుధవారం లఘు చర్చతో ప్రారంభం కానుంది. అలాగే అసెంబ్లీలో ఆమోదించిన ఐదు బిల్లులకు మండలిలో ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.
వైద్యారోగ్యం, దేవాదాయ, హోం, నీటిపారుదల రంగాలకు సంబందించిన చట్టసవరణ బిల్లులను సైతం ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టనుంది.
ఈ బిల్లులను మంత్రులు సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు ప్రవేశపెట్టనున్నారు.
మండలిలో నేటి ప్రశ్నోత్తరాలు..
డయాలసిస్ కేంద్రాలు, అతిసార వ్యాప్తి, జల్ జీవన్ మిషన్, భోగాపురం విమానాశ్రయం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ బ్లో అవుట్ తదితర ప్రశ్నలకు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
నౌకాశ్రయాలు - ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, పర్యాటక కార్యకలాపాల ద్వారా ఉపాధి, గ్రంథాలయ రుసుం వసూలు, ధాన్యం కళ్లాల ఏర్పాటు, ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ, ఆడబిడ్డ నిధి పథకం తదితర ప్రశ్నలకు సైతం మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి లీగల్ క్లబ్స్
Read Latest AP News and National News