Share News

రాహులే కాబోయే ప్రధాని!

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:14 AM

దేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌ గాంధీయేనని.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దీన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.

రాహులే కాబోయే ప్రధాని!
Jagga Reddy

  • దీన్ని తెలంగాణ కాంగ్రెస్‌ చాలెంజ్‌గా తీసుకుంటుంది

  • 14 లోక్‌సభ సీట్లు గెలిచి తీరుతాం

  • ప్రధాని పదవి పుట్టిందే రాహుల్‌ ఇంట్లో..

  • ఆయన అవ్వాలనుకుంటే 2004లోనే అయ్యేవారు

  • రాముని పేరు చెప్పుకొని 3 సార్లు మోదీనే ప్రధాని అయ్యారు

  • రఘుపతి రాఘవ రాజారాం అంటూ స్వాతంత్రోద్యమ కాలంలోనే గాంధీజీ రాముని భజన చేశారు

  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశానికి కాబోయే ప్రధాని రాహుల్‌ గాంధీయేనని.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దీన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌ తలచుకుంటే 2004లోనే దేశానికి ప్రధాని అయ్యుండేవారన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌ దేశ ప్రధాని అయ్యే అవకాశం లేదంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బీజేపీ అధికారంలోకి రాకముందు ఏం జరిగిందో ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రధాని పదవే రాహుల్‌ కుటుంబంలో పుట్టిందన్న సంగతి ఆయన మరిచిపోతున్నారన్నారు.


దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజలు జవహర్‌లాల్‌ నెహ్రూను భారత ప్రధానిగా నేరుగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. ‘2004లో కేంద్రంలో సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో సోనియా లేదా రాహుల్‌ ప్రధాని కావాలంటూ అప్పటి ఎంపీలు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. కానీ తమకు ఆ పదవి వద్దంటూ సోనియా, రాహుల్‌లు తిరస్కరించారు. మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిని చేశారు. రెండో సారి యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా రాహుల్‌ను ప్రధాని పదవి తీసుకోవాలంటూ మన్మోహన్‌సింగ్‌ కోరారు. కానీ అప్పుడూ రాహుల్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించి.. మన్మోహన్‌నే ప్రధానిగా కొనసాగాలని కోరారు’ అని వివరించారు. రాహుల్‌ ప్రధాని కాలేరంటూ చెప్పడానికి అమిత్‌షా ఎవరని ప్రశ్నించారు. రాహుల్‌ ప్రధాని కావాలనుకుంటే అయిపోతారని, దేశ ప్రజలు ఆయన్ను ప్రధానిని చేస్తారని అన్నారు. ఈ దేశ ఓటర్లను శాసించే హక్కు అమిత్‌షాకు లేదని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లకుగాను 14 సీట్లు గెలుచుకుని ఆయన అహంకారపు మాటలకు సమాధానం ఇస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి బలముంది కానీ.. బీజేపీకి లేదన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడమన్నది ఒక చాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తామని స్పష్టం చేశారు.


రాముడి పేరుతో రాజకీయాలు..

శ్రీరాముని పేరుతో మూడు సార్లు ప్రధాని అయిన మోదీ.. ఆ శ్రీరాముని అడుగుజాడల్లో మాత్రం దేశాన్ని పరిపాలించట్లేదని జగ్గారెడ్డి విమర్శించారు. కేవలం రాజకీయాల కోమే శ్రీరాముని పేరును ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే రఘుపతి రాఘవ రాజారాం అంటూ మహాత్మా గాంధీ.. శ్రీరాముడి భజన చేశారని గుర్తు చేశారు. అప్పటికీ బీజేపీ గానీ, మోదీ, అమిత్‌షాలు కానీ పుట్టలేదన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పేరుతోనూ ఓట్లు తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. వాస్తవానికి ఆయన పక్కా కాంగ్రెస్‌ పార్టీ అని, నెహ్రూ క్యాబినెట్‌లో మంత్రి అని గుర్తు చేశారు. నెహ్రూ డైరెక్షన్‌లోనే హైదరాబాద్‌ సంస్థానాన్ని పటేల్‌.. దేశంలో విలీనం చేశారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

యూనిఫారాలపై విద్యార్థులు ఏమంటున్నారు?

నేడు క్యాబినెట్‌ భేటీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 04:14 AM