యూనిఫారాలపై విద్యార్థులు ఏమంటున్నారు?
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:00 AM
వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫారాలపై వారినుంచి అభిప్రాయాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 4, (ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫారాలపై వారినుంచి అభిప్రాయాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంతో పోలిస్తే.. ఈసారి ఎంతో నాణ్యమైన యూనిఫారాలు, ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో అందజేశామని తెలిపారు. ఆయా రంగులు, డిజైన్లపై విద్యార్థుల అభిప్రాయాలు సేకరించాలని, తద్వారా భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్లకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని అన్నారు.
విద్యార్థులకు యూనిఫారాలు, కిట్ల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. యూనిఫారాలతోపాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఒకటి రెండు సంస్థల పరిధిలో కొన్ని వస్తువుల పంపిణీ 95 శాతం వరకు పూర్తయిందని చెప్పారు. అయితే ఆ వస్తువుల పంపిణీని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందజేసే యూనిఫారాలు, ఇతర సామగ్రికి సంబంధించి విధి విధానాలను (ఎస్‌వోపీ) రూపొందించాలని సూచించారు. పాఠశాలలు తెరిచిన రోజునే మొత్తం వస్తువులు అందేలా ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News