సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
ABN , Publish Date - Nov 05 , 2026 | 03:52 AM
సదర్ వేడుకలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఉత్సవాలను తమ ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించడంతో పాటు రూ.5 కోట్లు కేటాయించిందని తెలిపారు.
రాష్ట్ర పండుగగా గుర్తించి 5 కోట్లు కేటాయించాం..
యాదవులకు సముచిత స్థానం కల్పిస్తాం
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు యాదవుల సహకారం ఉండాలి
సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సదర్ వేడుకలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఉత్సవాలను తమ ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించడంతో పాటు రూ.5 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి, పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన దున్నపోతులకు పూజలు చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.
నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని ఆదరించడంలో యాదవులు కీలక పాత్ర పోషించారని అన్నారు. యాదవుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడే బాధ్యత తనదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించి, జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్ని వార్గాలకు వాటా కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి యాదవులు సహకరించాలని కోరారు. యాదగిరి గుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసుకుని మరీ సదర్ వేడుకలకు హాజరయ్యానంటే యాదవులపై తనకున్న అభిమానమే కారణమని సీఎం అన్నారు.
పశుసంపదతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి
పశుసంపద అభివృద్ధితోనే వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సదర్ ఉత్సవాలకు రాష్ట్ర పండగ హోదా కల్పించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రోత్సహిస్తుందని చెప్పారు. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. యాదవ సమాజం ఎప్పుడూ అన్యాయం, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడతామని స్పష్టం చేశారు. యాదవ సమాజం ఐక్యత దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆకాక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సదర్ ఉత్సవాలు దేశానికే ప్రత్యేకమని ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీ ధర్మేందర్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర పండగగా గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సదర్ వేడుకలు హైదరాబాద్‌కు ప్రత్యేక శోభను తీసుకొస్తున్నాయని అన్నారు.
ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు..
శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కువద్ద నిర్వహించిన సదర్ వేడుకలు వైభవంగా జరిగాయి. జంటనగరాల్లోని పలు ప్రాంతాల నుంచి యాదవులు ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులను బ్యాండ్ మేళాలు, డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. దున్నపోతుల విన్యాసాలు, మహి ళల కోలాటాలు, బోనాలు, గిరిజన నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా యాదవ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీహరి, వివేక్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జమ్ముకశ్మీర్ ఎంపీ లాల్‌సింగ్, పలువురు ప్రజాప్రతినిధులు, శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ చైర్మన్ అంజన్ కుమార్ యాదవ్ తదితరలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News