Share News

నేడు క్యాబినెట్‌ భేటీ

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:57 AM

రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తులో ఈ సమావేశం జరగనుంది.

నేడు క్యాబినెట్‌ భేటీ
Telangana Cabinet

  • గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ.. ఏర్పాట్లతో పాటు ఎల్‌నినో ప్రభావం, కరువు మండలాలపై చర్చ

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తులో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు బుధవారం ఒక నోట్‌ను జారీ చేశారు. కాగా, క్యాబినెట్‌ భేటీకి ముందు.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమవుతారని, అనంతరం మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.


ఈ సమావేశంలో ప్రధానంగా డిసెంబరు 7, 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026 నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి జరుగుతున్న పనులు, ఎప్పటివరకు పూర్తవుతాయనే దానితోపాటు పలు వివరాలను అధికారుల నుంచి ఆరా తీయనున్నారు. అలాగే సమ్మిట్‌ నిర్వహణకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన ప్రచార కార్యక్రమాలు, ముందస్తు కార్యక్రమాలపై చర్చిస్తారు. వీటితోపాటు ఏయే దేశాల నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది, ఆహ్వానాలను పంపించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా పలు విషయాలు ప్రస్తావనకు రానున్నాయి.


కరువు పరిస్థితులపై చర్చ..

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో మాట్లాడనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 365 కరువు మండలాలను ప్రకటించినందున కేంద్రం నుంచి కోరిన రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం, ఉపాధి హామీ పని కల్పించే విషయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మంగళవారం ఒక్కరోజే ఉపాధి హామీ పనికి రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మందికి పైగా హాజరయ్యారు. దీంతో పని కల్పించే ఈ అంశంపై కేంద్రంతో చర్చలు జరపడంపై మాట్లాడనున్నారు.


ఇక మార్చి 16న ప్రారంభమైన 3వ శాసనసభ 8వ సమావేశాన్ని అక్టోబరు 31న ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ నేపథ్యంలో.. పలు కీలక అంశాలపై ప్రభుత్వం ఆర్డినెన్సులు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చే అంశాలు, అందుకు కారణాలపై క్యాబినెట్‌లో చర్చించవచ్చని సమాచారం. దీంతోపాటు రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగంలో భూసేకరణ పరిహారంలో రాష్ట్ర వాటా కోసం ఇటీవల తీసుకున్న రుణానికి సంబంధించిన ఫైలు కూడా క్యాబినెట్‌ ముందుకు రానుందని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 03:57 AM