రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్..
ABN , Publish Date - Jun 30 , 2026 | 02:23 PM
తెలంగాణ పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission) సీరియస్ అయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను మూడు వారాల్లో సమర్పించాలని సూర్యాపేట జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులను ఆదేశించింది. రాజేశ్‌ను కోదాడ పోలీసులు ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ పద్ధతుల్లో చిత్రహింసలకు గురిచేశారని న్యాయవాది రామారావు ఇమ్మినేని ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించిన కమిషన్ ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వివరణ కోరింది.
బాధిత కుటుంబ సభ్యులు ఈ ఘటనను కస్టడీ హత్యగా పరిగణించాలని, బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ప్రత్యేకంగా పోస్ట్‌మార్టం వీడియో, పోస్ట్‌మార్టం నివేదిక, మేజిస్ట్రియల్ విచారణ వివరాలు, వైద్యపత్రాలు, కేసు దర్యాప్తునకు సంబంధించిన అన్ని రికార్డులను కమిషన్ ముందు ఉంచాలని సూచించింది. అలాగే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది.
ఈ కేసులో సూర్యాపేట జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్‌లకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రాజేశ్ మరణానికి దారితీసిన పరిస్థితులు, పోలీసుల పాత్ర, దర్యాప్తు పురోగతి వంటి అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరింది. అదేవిధంగా, ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించిందా? ఎలాంటి చర్యలు తీసుకుందనే వివరాలను కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది. రాష్ట్ర కమిషన్ పాత్ర, దర్యాప్తు స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని సూచించింది.
కాగా, రాజేశ్‌పై ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కేసు దర్యాప్తు నేపథ్యంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే కస్టడీలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలు, మరణానికి గల కారణాలపై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది. ఎన్‌హెచ్‌ఆర్సీ జోక్యంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు వారాల్లో సమర్పించాల్సిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్
డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News