నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్.. మొబైల్‌తో గూగుల్‌లో సమాధానాలు వెతికిన విద్యార్థి అరెస్ట్
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:37 AM
హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ పట్టుబడిన ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో (National Eligibility Cum Entrance Test) మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాష్‌రూమ్‌లోని ఫ్లష్ ట్యాంక్‌లో ఫోన్ దాచిపెట్టి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్ష కేంద్రంగా ఉన్న రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు విద్యార్థి పరీక్ష ప్రారంభానికి చాలా ముందుగానే చేరుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో కేంద్రంలోకి ఆ విద్యార్థి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌ను జిప్‌లాక్ కవర్‌లో భద్రపరచి వాష్‌రూమ్‌లోని ఫ్లష్ ట్యాంక్‌లో దాచాడు. వాష్‌రూమ్ వెంటిలేటర్ ద్వారా ఫోన్‌ను లోపలికి చేర్చాడు. పరీక్ష కేంద్రంలో భద్రతా తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించినప్పటికీ, ఉదయం 6 గంటలకు, 11 గంటలకు సిబ్బంది జరిపిన రెండు విడతల తనిఖీల్లో ఫ్లష్ ట్యాంక్‌లో దాచిన మొబైల్ ఫోన్‌ను గుర్తించలేకపోయారు. దీంతో విద్యార్థి తన ప్రణాళికను అమలు చేయగలిగాడు. పరీక్ష జరుగుతున్న సమయంలో కడుపు నొప్పి ఉందని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థి, ఎక్కువసేపు తిరిగి రాకపోవడంతో ఇన్విజిలేటర్లకు అనుమానం వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపి తనిఖీ చేయించగా, వాష్‌రూమ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ గూగుల్ క్రోమ్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న సమయంలో అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా సమాధానాలు వెతికి..
సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌ను పరిశీలించగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా పరీక్ష ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను వెతికినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో తాను చేసిన తప్పును అంగీకరించాడు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4)తో పాటు Public Examinations (Prevention of Unfair Means) Act-2024 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఈ ఘటన పరీక్షల భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై మరోసారి చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్
ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News