Share News

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:14 PM

టాక్సిక్ సినిమాపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలో అశ్లీలత ఎక్కువగా ఉందని విమర్శించారు.

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్
MLA Raja Singh

హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): టాక్సిక్ సినిమాపై (Toxic movie) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలో అశ్లీలత ఎక్కువగా ఉందని విమర్శించారు. స్నేహితులతో కలిసి మూవీకి వెళ్లిన తాను, సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసిన అనంతరం మధ్యలోనే బయటకు వచ్చానని తెలిపారు.సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఏదో ఒక మంచి సందేశాన్ని అందించేలా ఉండాలని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. అయితే టాక్సిక్ మూవీలో డ్రగ్స్, హత్యలు, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రదర్శన తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం పెద్దగా కనిపించలేదని పేర్కొన్నారు.


ఇరుముడి సినిమాలో మంచి సందేశం ఉంది..

ఇదే సమయంలో ఇతర సినిమాలను ఉదాహరణగా రాజాసింగ్ ప్రస్తావించారు. ప్రముఖ నటుడు రవితేజ నటించిన ఇరుముడి సినిమాలో మంచి సందేశం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే దైవ సంబంధమైన అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.


ఛావా సినిమాను ధార్మిక విలువలను కాపాడేలా తెరకెక్కించారు..

ఛావా సినిమా గురించి కూడా రాజాసింగ్ ప్రస్తావించారు. ఆ సినిమాలో హిందూ ధర్మానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారని తెలిపారు. ధార్మిక విలువలను కాపాడేలా కథను తెరకెక్కించారని వివరించారు.


హీరో యష్‌కు కూడా రాజాసింగ్ సలహా..

టాక్సిక్ మూవీలో నటించిన హీరో యష్‌కు కూడా రాజాసింగ్ సలహా ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో నటించడం వల్ల భవిష్యత్తులో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, కథలను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సినిమా రంగానికి భారీ స్థాయిలో అభిమానులు ఉన్న నేపథ్యంలో, హీరోలు తమ సినిమాల ద్వారా సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాజాసింగ్ సూచించారు. ప్రస్తుతం టాక్సిక్ మూవీపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

ఉద్యోగాల పేరుతో మోసం.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏపై చీటింగ్ కేసు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 04:34 PM