ఆర్థిక హబ్‌గా కోకాపేట..
ABN , Publish Date - May 23 , 2026 | 07:33 AM
హైదరాబాద్‌లోని కోకాపేట ఇప్పుడు కేవలం ఒక శివారు ప్రాంతం కాదు. అది నగర భవిష్యత్తును శాసించబోయే సరికొత్త ఆర్థిక హబ్.
భారీ ప్రాజెక్టుల రాకతో డిమాండ్
అన్ని ప్రాంతాలతోనూ కనెక్టివిటీ
ఔటర్ వెలుపల ఆత్యాధునిక ప్రపంచం
లక్షలాది మంది ఉద్యోగుల కేంద్ర బిందువు
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు
హైదరాబాద్ సిటీ: కోకాపేట ఇప్పుడు కేవలం ఒక శివారు ప్రాంతం కాదు. అది నగర భవిష్యత్తును శాసించబోయే సరికొత్త ఆర్థిక హబ్. ఐటీ కారిడార్‌లో అంతర్భాగంగా ఉంటూ లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్ర బిందువుగా మారింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు మణిహారంగా నిలవనుంది. ఒకప్పుడు నివాస ప్రాంతంగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి హైరైజ్డ్ భవనాలు(ఆకాశహర్మ్యాలు)లకు నిలయంగా మారింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో సరికొత్త ఫ్యూచర్ సిటీ తరహాలో రూపాంతరం చెందుతోంది. రాబోయే కాలంలో ఇక్కడి నుంచే ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కారిడార్ విస్తరణ, భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధితో కోకాపేటను భవిష్యత్ ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల దృష్టి కేంద్రీకృతమవుతోంది.
రవాణా రంగంలో విప్లవం
కోకాపేట అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రవాణా ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాయి. మెట్రోరైల్ రెండో దశ కింద రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ర్టిక్ట్ మీదుగా కోకాపేట నియో పోలీస్ వరకు 11 కి.మీ మేర మెట్రోరైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అలాగే, కేంద్రం ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై-పుణే-హైదరాబాద్ కారిడార్ కోకాపేట వరకు ప్రతిపాదించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోకాపేట వరకు వస్తున్న హైస్పీడ్ రైల్ మార్గాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు పొడిగించి అక్కడ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ హబ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సుమారు 500 ఎకరాలను కేటాయిస్తామని ముందుకు వచ్చింది. ఇప్పటికే ఔటర్ రింగు రోడ్డు కోకాపేట మీదుగా వెళుతుండడంతో రవాణా నెట్‌వర్క్ పరంగా అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
మెరుగైన కనెక్టివిటీ
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట ప్రాంతం కనెక్టివిటీకి రారాజుగా ఉంటుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కోకాపేటలోని ఓఆర్‌ఆర్ మొట్టమొదటి ఇంటర్‌చేంజ్ - 1, దాని పక్కనే 1-2 కి.మీ దూరంలోనే నియో పోలీస్ లేఅవుట్‌లోకి వెళ్లి, వచ్చేందుకు వీలుగా ఓఆర్‌ఆర్ ట్రంపెట్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా కోకాపేట నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి వైపు, ముంబై-హైదరాబాద్ జాతీయ రహదారి, మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం, అదే దారిలో బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి.
వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లే పలు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం.. ఇలా కోకాపేట నుంచి నిమిషాల వ్యవధిలో అత్యంత కీలకమైన ప్రాంతాలకు చేరుకునేలా 156 కి.మీ ఓఆర్‌ఆర్ రోడ్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. ఇక కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రోరైలు రెండోదశ, హైస్పీడ్ రైలు కారిడార్, అదేవిధంగా భవిష్యత్తులో ఔటర్ రింగు రోడ్డు లోపల రింగురైలు మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదన ఉండడంతో ఇక్కడి నుంచి ఉండే కనెక్టివిటీ మరే ఇతర ప్రాంతానికీ లేనంతగా మారబోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ విస్తరణకు కోకాపేట ప్రధాన అక్షంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దిగ్గజ కంపెనీలు
ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్.. ఇలా వందలాది కంపెనీలు కోకాపేట చుట్టు పక్కలే ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా హెచ్‌ఎండీఏ సుమారు 534 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నియోపోలీస్ లేఅవుట్‌లో వస్తున్న హైరైజ్ భవనాలతో కోకాపేట దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవనుంది. మైహోం గ్రావా, రాజపుష్ప వెస్ట్ ఎవన్యూ వంటి మెగా కమర్షియల్ ప్రాజెక్టులతో రాబోయే రోజుల్లో లక్షలాది మంది సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మేనేజ్‌మెంట్ రంగ నిపుణులకు ఇది ఉపాధి వేదిక కానుంది. ఎత్తయిన కొండపై ఉన్న నియోపోలీస్ లేఅవుట్‌లో 150 నుంచి 100 అడుగుల రోడ్డు, భూగర్భ విద్యుత్ లైన్లు, కనుచూపు మేరలో గండిపేట చెరువు, ఓఆర్‌ఆర్‌తో అనుసంధానానికి ట్రంపెట్ నిర్మాణం వంటి ఉన్నాయి. అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాల కల్పన, అద్బుతమైన కనెక్టివిటీ కలబోసి కోకాపేట గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టనున్నాయి.
అల్ట్రా లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా..
గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఇప్పటికే కార్పొరేట్ కార్యాలయాలు, లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, వాణిజ్య సముదాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కోకాపేట చుట్టూ గండిపేట, మంచిరేవుల, నార్సింగి, మోకిల, కొల్లూరు, వట్టినాగులపల్లి, శంకర్‌పల్లి వంటి నివాస ప్రాంతాలకు అత్యంత అనుకూలంగా ఉండడంతో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అల్ర్టా లగ్జరీ తరహాలో భారీ ప్రాజెక్టులను ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే చేపడుతున్నాయి. రూ.5 కోట్లు మొదలు కొని రూ.25 కోట్ల విలువ చేసే నివాస ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సైతం అక్కడి నుంచి కోకాపేట, ఆ చుట్టు పక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉంటూ అత్యంత విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టాప్-50 ఉక్కపోత నగరాలన్నీ భారత్‌లోనే
మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News