Share News

నష్టం వస్తున్నా మక్కలు కొంటున్నాం

ABN , Publish Date - May 23 , 2026 | 05:25 AM

ఎకరా విస్తీర్ణంలో పండే మొక్కజొన్నలను మద్దతు ధరకు కొంటే.. ప్రభుత్వానికి రూ. 60 వేల దాకా నష్టం వస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వెల్లడించారు.

నష్టం వస్తున్నా మక్కలు కొంటున్నాం

  • రాజకీయ భవిష్యత్తుపై భయంతోనే కేటీఆర్‌ మాటలు

  • కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): ఎకరా విస్తీర్ణంలో పండే మొక్కజొన్నలను మద్దతు ధరకు కొంటే.. ప్రభుత్వానికి రూ. 60 వేల దాకా నష్టం వస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వెల్లడించారు. అయినా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తోందన్నారు. మొక్కజొన్నలు కొనుగోలు చేయవద్దంటూ కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసినా.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తూనే ఉందన్నారు. ఎంపీ బలరాం నాయక్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లినప్పుడు కేటీఆర్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామచంద్రనాయక్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌పైన కేటీఆర్‌ ఇష్టానుసారంగా భాషను ఉపయోగిస్తే తెలంగాణ ప్రజలు నాలుక కోస్తారని హెచ్చరించారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ను అప్పుల పాలు చేసింది, రైతులకు బేడీలు వేసింది బీఆర్‌ఎస్‌ వాళ్లేనన్నారు.

కనీస వేతనాల పెంపుపై ఐఎన్‌టీయూసీ సంబరాలు

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు పెంచిన నేపథ్యంలో.. శుక్రవారం ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కార్మిక మంత్రి వివేక్‌, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ల చిత్రపటాలకు ఐఎన్‌టీయూసీ కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. రాజిరెడ్డి మాట్లాడుతూ సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుందన్నారు. కార్మికుల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 05:25 AM