టాప్-50 ఉక్కపోత నగరాలన్నీ భారత్‌లోనే
ABN , Publish Date - May 23 , 2026 | 06:04 AM
ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టాప్-50 నగరాలు అన్నీ కూడా భారత్‌లోనే ఉన్నాయని వాతావరణ అధ్యయన వెబ్‌సైట్ ఏక్యూఐ.ఇన్ వెల్లడించింది.
జాబితాలో భీమవరం, జగిత్యాల, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్
వాతావరణ అధ్యయన వెబ్‌సైట్ ‘ఏక్యూఐ.ఇన్’ వెల్లడి
న్యూఢిల్లీ, మే 22: ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టాప్-50 నగరాలు అన్నీ కూడా భారత్‌లోనే ఉన్నాయని వాతావరణ అధ్యయన వెబ్‌సైట్ ఏక్యూఐ.ఇన్ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు నమోదు చేసిన ఉష్ణోగ్రతల ప్రకారం ఈ జాబితాను ప్రకటించింది. వీటిలో తెలంగాణలోని జగిత్యాల (43 డిగ్రీల సెల్సియస్), ఆదిలాబాద్ (43), ఖమ్మం (42), వరంగల్ (42), ఏపీలోని భీమవరం (42) ఉన్నాయి. కాగా, ఒడిశాలోని బాలన్‌గిర్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో టాప్-50లో ప్రథమస్థానంలో ఉంది. జాబితాలో సగానికి పైగా పట్టణాలు, నగరాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినవే కావటం గమనార్హం. ఆ రాష్ట్రంలోని వారణాసి, బాందా, బరేలీ, అయోధ్యల్లో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పలు పట్టణాల్లో ఉష్ణోగ్రలు 46 డిగ్రీలను దాటాయి. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లోనూ 45 డిగ్రీల వరకూ చేరుకున్నాయి. వేడిగాలులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా మధ్యప్రదేశ్, యూపీ, బిహార్, హరియాణా, మహారాష్ట్రలకు వ్యాపించాయి. దీనిని భారత ఉపఖండం మీద ఆవరించిన ‘హీట్ డోమ్’ (వేడి పైకప్పు)గా వాతావరణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. వాయువ్య ప్రాంతం నుంచి వీస్తున్న పొడిగాలులు, రుతుపవనాల రాకలో ఆలస్యం తదితర కారణాలతో ఎండలు ఇంత తీవ్రంగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. రానున్న కొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. పలు రాష్ట్రాలకు ఇప్పటికే ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లను జారీ చేసింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లటం మానుకోవాలని, ప్రయాణాలను తగ్గించుకోవాలని, వడదెబ్బ తగిలితే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.