కూటమిలో ‘రాజ్యసభ’ సందడి!
ABN , Publish Date - May 23 , 2026 | 04:41 AM
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో రాజ్యసభ సీట్ల సందడి మొదలైంది. జూన్ 21న రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
4 ఖాళీలు.. భారీగా ఆశావహులు
రేసులో కిలారు రాజేశ్, భాష్యం రామకృష్ణ, గల్లా, కంభంపాటి, వర్ల రామయ్య
బీసీ కోటాలో చింతకాయల విజయ్!
జనసేన నుంచి సీటు ఆశిస్తున్న లింగమనేని
బీజేపీ తరఫున బరిలో మాధవ్?
సీమ నుంచి తనకు చాన్సివ్వాలని కోరుతున్న రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి
ఏడాదిన్నరే తాను ఎంపీగా ఉన్నందున కొనసాగింపు కోరుతున్న సానా సతీశ్
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో రాజ్యసభ సీట్ల సందడి మొదలైంది. జూన్ 21న రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీటికి భారీ పోటీ నెలకొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం రానివారు.. పార్టీ కోసం ఎంతోకాలంగా పనిచేస్తున్న సీనియర్లు పోటాపోటీగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీ, జనసేనకు ఎన్ని కేటాయిస్తారో స్పష్టత రావలసి ఉంది. 2024లో వైసీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేశారు. మస్తాన్‌రావు, మోపిదేవి టీడీపీలో చేరగా.. తెలంగాణకు చెందిన కృష్ణయ్య బీజేపీలో చేరారు. మస్తాన్‌రావును టీడీపీ నాయకత్వం తిరిగి రాజ్యసభకు పంపింది. మోపిదేవి బదులు సానా సతీశ్‌కు అవకాశం ఇచ్చింది. బీజేపీ కృష్ణయ్యను మళ్లీ నామినేట్ చేసింది. 2025లో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని సీఎం చంద్రబాబు బీజేపీకి ఇచ్చారు. పాకా సత్యనారాయణను ఆ పార్టీ నామినేట్ చేసింది. ఇప్పటివరకు రెండు స్థానాలను బీజేపీకి ఇచ్చినట్లయింది. దరిమిలా ఆ పార్టీకి ఇప్పుడు ఇవ్వకుండా.. జనసేనకు ఒకటి కేటాయించి మూడు స్థానాలను టీడీపీ తీసుకుంటుందనే ప్రచా రం జరుగుతోంది. ఒకవేళ బీజేపీ నుంచి ఒత్తిడి వస్తే వారికి ఒకటి కేటాయించక తప్పదు. ఆ స్థానం నుంచి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. అయితే రాష్ట్రం నుంచే ఆ పార్టీ అధ్యక్షుడు మాధవ్‌ను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.
భారీగా ఆశావహులు..
వైసీపీ హయాంలో 2020లో రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డిల పదవీకాలం జూన్ 21న ముగియనుంది. మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఎంపికైన టీడీపీ ఎంపీ సానా సతీశ్ పదవీకాలం కూడా అదే రోజు ముగుస్తోంది. ఈయన ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉన్నారు. దీంతో తిరిగి తనకు కొనసాగింపు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అయితే రాజ్యసభ ఆశిస్తున్న పలువురు సీనియర్లు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. సీటు కేటాయింపులో పార్టీపై నిబద్ధత, అనుభవం రెండింటినీ పరిగణనలో తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. గతంలో చాలా మంది టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లినవారు ఇప్పుడు పార్టీపై విమర్శలు చేస్తున్నారని.. దానిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలనేది సీనియర్ల వాదనగా ఉంది. మరోవైపు పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న కిలారు రాజేశ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు వంటి వారు పెద్దల సభకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వీరిలో ఒకరికే అవకాశం దక్కనుంది. అయితే జనసేన నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న లింగమనేని రమేశ్‌కు చాన్స్ లభిస్తే.. అదే సామాజికవర్గానికి చెందిన పై నలుగురికీ అవకాశం దక్కడం అనుమానమే. సాధారణంగా ప్రాంతాలు, సామాజిక సమీకరణల ఆధారంగా పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు. ఈసారి సామాజిక సమీకరణలకు ప్రాధాన్యమిచ్చే పక్షంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్య ఆశిస్తున్నారు. అలాగే ఐ-టీడీపీ ఇన్‌చార్జి, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కూడా బీసీ కోటాలో సీటు ఆశిస్తున్నారు. మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎండీ సైతం బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. రాయలసీమ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే తన పేరు పరిశీలించాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు.
సీఎంను కలవడానికి నేతలు క్యూ
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవడానికి పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు క్యూ కడుతున్నారు. శుక్రవారం ఎంపీలు సీఎం రమేశ్, కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ సీఎంవోకి వచ్చి చంద్రబాబును కలిశారు.
సీఎం చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ
స్థానిక ఎన్నికలు, యోగా డే నిర్వహణపై చర్చ
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉండవల్లి సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. జూన్ 5 నుంచి 21 వరకు ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి మాధవ్ తీసుకెళ్లారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే అంశంపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుపల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.
సీడ్ బాల్స్‌తో పచ్చదనం పెంచాలి: సీఎం
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో పచ్చదనం పెంపుపై సీఎం సమీక్ష జరిపారు. త్వరలో చేపట్టే 2.5 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. జూన్‌లో సీడ్ బాల్స్ సిద్ధం చేసి.. జూలై, ఆగస్టులో పంపిణీ చేయాలని నిర్దేశించారు. ఇందులో విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలతో సహా అందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు.