Share News

2 వేల కిడ్నీ మార్పిళ్లతో నిమ్స్‌ రికార్డు

ABN , Publish Date - May 23 , 2026 | 05:43 AM

నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) మరో చరిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వేల కిడ్నీ మార్పిళ్లు చేసిన తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది.

2 వేల కిడ్నీ మార్పిళ్లతో నిమ్స్‌ రికార్డు

  • దక్షిణాదిలో తొలి, దేశంలో మూడో ఆస్పత్రిగా ఘనత

  • తొమ్మిదేళ్లలో వెయ్యిపైగా ట్రాన్స్‌ప్లాంట్స్‌

  • 1900మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స

  • వైద్యులకు సీఎం, మంత్రి దామోదర ప్రశంస

హైదరాబాద్‌/హైదరాబాద్‌సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) మరో చరిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వేల కిడ్నీ మార్పిళ్లు చేసిన తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా రికార్డు సృష్టించింది. సంగారెడ్డికి చెందిన 20 ఏళ్ల యువకుడికి గురువారం రాత్రి మూత్రపిండ మార్పిడి చేసి.. ఈ ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యధిక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన అగ్రగామి వైద్య సంస్థల్లో ఒకటిగా నిలవడమే కాదు.. ఏకంగా మూడో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి శుక్రవారం ప్రకటించారు.

మూడేళ్ల 4 నెలల్లోనే 500 శస్త్రచికిత్సలు

1989లో నిమ్స్‌ యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో మొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అనుభవజ్ఞులైన వైద్యులు, తక్కువ ధరకే మంచి వైద్యం, వైద్య బృందం చొరవతో కిడ్నీమార్పిడి శస్త్రచికిత్సలు గణనీయంగా పెరిగాయి. 1989 - 2010 మధ్య మొదటి 448 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగితే, 2011 నుంచి 2017 మధ్య 552 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అప్పటి నుంచి 2023 జనవరి మధ్య మరో 500 కిడ్నీ మార్పిడి చికిత్సలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే.. మూడేళ్ల 4నెలల వ్యవధిలోనే వేగంగా 500శస్త్రచికిత్సలను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. బహుళ రక్తనాళాలు ఉన్న కిడ్నీల మార్పిడి, చిన్నపిల్లలకు కిడ్నీ మార్పిడి, ఒక సారి ట్రాన్స్‌ప్లాంట్‌ విఫలమైన రోగులకు ’రీడూ ట్రాన్స్‌ప్లాంట్‌’ వంటి అత్యంత క్లిష్టమైన సర్జరీలను నిమ్స్‌ యూరాలజీ బృందం విజయవంతంగా పూర్తి చేసింది. 2025లో రోబోటిక్‌ రెనాల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ శస్త్రచికిత్స నిర్వహించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లలో 500పైగా రోబోటిక్‌ సర్జరీలు చేయడం విశేషం.


అత్యధికులు పేదలే...

లైవ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ (బంధువుల నుంచి కిడ్నీ సేకరించి శస్త్రచికిత్స) చేసిన రోగులకు మొదటి ఏడాదిలో కిడ్నీ పని తీరు (గ్రాఫ్ట్‌ సర్వైవల్‌) 95శాతం పైగా, మూడేళ్లలో 90శాతం పైగా, ఐదేళ్లలో 85శాతం గా ఉంది. కడావర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ (మరణించిన వారి నుంచి కిడ్నీ సేకరించి శస్త్రచికిత్స) చేసిన రోగులకు మొదటి ఏడాదిలో 90శాతం పైగా, మూడేళ్లలో 85ు పైగా, ఐదేళ్లలో 80శాతం గా సక్సెస్‌ రేట్‌ నమోదైంది. ఇలా లబ్ధి పొందిన వారిలో అత్యధికులు పేద, మధ్యతరగతి వర్గాల వారే కావడం గమనార్హం. మొత్తం 2,000 మంది రోగుల్లో 1900 మందికి(అంటే 95 శాతం మందికి) ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు జరగడం విశేషం. తద్వారా బాధితులకు రూ.120కోట్ల మేర లబ్ధి చేకూరింది. గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిడ్నీ డిసీజ్‌ అండ్‌ రీసెర్స్‌ సెంటర్‌(ఐకేడీఆర్‌సీ) ఇప్పటిదాకా 8,182 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసింది. ఆ తర్వాత పంజాబ్‌లోని లూథియానా క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ(పీజీఐఎంఈఆర్‌) ఆస్పత్రిలో 5,400 శస్త్రచికిత్సలు చేశారు. వాటి తర్వాత అత్యధిక శస్త్రచికిత్సలు చేసిన ఆస్పత్రిగా నిమ్స్‌ నిలిచింది. కాగా, నిమ్స్‌ యూరాలజీ విభాగం హెడ్‌ రాహుల్‌ రాజ్‌, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు, సిబ్బంది అద్భుతమైన పని తీరుతోనే ఈ ఘనతను సాధించగలిగామని ఆస్పత్రి డైరెక్టర్‌ బీరప్ప తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య ేసవలు అందించేందుకు నిమ్స్‌కు సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు చెప్పారు. రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన నిమ్స్‌ వైద్య బృందానికి సీఎం రేవంత్‌, మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు తెలిపారు.

1.jpg

నిమ్స్‌లో సక్సెస్‌ రేటు ఎక్కువ

బంధువుల నుంచి కిడ్నీ సేకరించి రోగికి ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడంలో పెద్దగా సమస్య ఉండదు. కానీ, మరణించిన వారి నుంచి సేకరించిన కిడ్నీ వస్తుందన్న సమాచారం అందగానే రోగిని గంటలోనే సిద్ధం చేసి పెట్టుకుంటాం. ఆపరేషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ప్రతీ చిన్న విషయంపై శ్రద్ధపెట్టి జాగ్రత్తగా ఉంటాం. అందుకే మా దగ్గర ట్రాన్స్‌ప్లాంట్‌ సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంది.

- డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌, యూరాలజీ హెచ్‌వోడీ, నిమ్స్‌

Updated Date - May 23 , 2026 | 05:43 AM