Share News

ఫ్యూచర్‌ సిటీలో ధూం ధాం!

ABN , Publish Date - May 23 , 2026 | 04:50 AM

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేయబోతోంది. ఇందుకు ఫ్యూచర్‌ సిటీని వేదిక చేసుకోనుంది.

ఫ్యూచర్‌ సిటీలో ధూం ధాం!

  • జూన్‌ 2న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాతర

  • 14 ఫార్మా కంపెనీల ఆర్‌అండ్‌డీ కేంద్రాల ఏర్పాటు

  • ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ భవనానికి శ్రీకారం

  • ఎన్‌ఐయూఎం, సింగరేణి భవనాలకూ శంకుస్థాపన

  • ప్రతిష్ఠాత్మక కంపెనీల డాటా సెంటర్లు ప్రారంభం

  • రాష్ట్రావతరణ దినోత్సవాన పలు సంక్షేమ పథకాలూ..

  • ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల పంపిణీ

  • కొత్తగా మరో రెండు లక్షల పింఛన్ల మంజూరు కూడా..

  • మహిళా శక్తి భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమం ఆదిలాబాద్‌లో ప్రారంభం

  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపైనా ప్రకటన

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేయబోతోంది. ఇందుకు ఫ్యూచర్‌ సిటీని వేదిక చేసుకోనుంది. ఇందులో భాగంగానే, ఫ్యూచర్‌ సిటీలో భారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుంది. ప్రధానంగా జూన్‌ 2న ఫ్యూచర్‌ సిటీప్రాంతంలో 14 ఫార్మా కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్టు తెలిసింది. వీటిలో డాక్టర్‌ రెడ్డీస్‌, భారత్‌ బయోటెక్‌, హెటిరో, ఎంఎస్ఎన్‌, అరబిందో తదితర ఫార్మా కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ పూర్తిగా కాలుష్యరహితంగా నెట్‌జీరో పర్యావరణ సూత్రాలకు లోబడి ఉండేలా నిబంధనలు విధించారు. అలాగే, మరికొన్ని కంపెనీల ప్యాకేజింగ్‌ యూనిట్లకు కూడా శంకుస్థాపన చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. అలాగే, ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తవ్వగా, లోపలి పనులు చేస్తున్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం) ప్రాంగణాన్ని 25 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆ భవనానికి, పదెకరాల్లో ఏర్పాటు చేయబోయే సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. అలాగే, పలు డేటా సెంటర్ల భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారని ఐటీ వర్గాల సమాచారం. ఫ్యూచర్‌ సిటీ పరిధిలోనే ప్రజా ప్రతినిధులు, ఏఐఎ్‌సలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం500ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.


సంక్షేమ రంగంలోనూ ఘనంగా...

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. మరికొన్నిటికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హెల్త్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జూన్‌ రెండో తేదీన ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అర్హులైన మరో రెండు లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభించనున్నారని తెలిసింది. జిల్లాల్లో నిర్మించదల్చిన ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సీఎం రేవంత్‌ ప్రారంభించనున్నారు. ఇక, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపైనా ప్రభుత్వం ఒక ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం రూ.4000 కోట్లను కేటాయించింది. దీని అమలుకు జూన్‌ 2న ఎల్‌ఐసీతో ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది.

Updated Date - May 23 , 2026 | 04:50 AM