Share News

కేబీఆర్‌ పార్క్‌ వద్ద వన్‌ వే ఇలా..

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:50 AM

అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటినుంచి ‘వన్‌ వే’ అమలు కానుంది.

కేబీఆర్‌ పార్క్‌ వద్ద వన్‌ వే ఇలా..
KBR Park one way

  • కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటినుంచి అమల్లోకి

  • సర్వం సిద్ధం చేసిన ట్రాఫిక్‌ పోలీసులు

  • 13 చోట్ల ఎగ్జిట్‌ పాయింట్లు

  • అదనంగా 35 సీసీ కెమెరాల ఏర్పాటు

  • పాదచారుల కోసం ‘సిటిజన్‌ పెవిలియన్లు’.. ప్రత్యేక జీబ్రా క్రాసింగ్స్‌

  • నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది పహారా.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ

హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ నేటినుంచి ‘వన్‌ వే’ అమలు కానుంది. ఈ మేరకు పోలీస్‌ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ట్రాఫిక్‌ కష్టాలకు చరమగీతం పాడేలా అమలు చేయనున్న వన్‌వే ప్రయాణతీరుపై వాహన చోదకులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రోడ్డులో ఎగ్జిట్‌ పాయింట్స్‌, లైన్‌ చేంజింగ్‌ పై అవగాహన ఉంటే సాఫీగా ప్రయాణం చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. గతంలో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ను పరిగణలోకి తీసుకొని సమస్యలను అధిగమించేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.


లేన్‌ 1.. 2 రోడ్ల వర్గీకరణ

హెచ్‌-సిటీ ప్రణాళికలో భాగంగా వాహనాలు ఎక్కడా నిలవకుండా సాఫీగా సాగేందుకు రహదారులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు.

లేన్‌-1 : దూరం వెళ్లే వాహనాలు, నాన్‌-స్టా్‌పగా ప్రయాణించే వారి కోసం ప్రత్యేకించారు.

లేన్‌- 2: కాలనీలు, ఉప రహదారుల్లోకి వెళ్లే వారి కోసం నిర్దేశించారు. పది ప్రాంతాల్లో లేన్‌ చేంజింగ్‌కు అవకాశం కల్పించారు.


13చోట్ల ఎగ్జిట్‌ పాయింట్లు

ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లేందుకు వీలుగా కేబీఆర్‌ చుట్టూ 13చోట్ల ఎగ్జిట్‌ పాయింట్లను శాస్త్రీయంగా తీర్చిదిద్దారు. కేబీఆర్‌ పార్కుకు నిత్యం వేలాది మంది వాకర్లు, పర్యాటకులు వస్తుంటారు. వీరికి ఇబ్బందులు రాకుండా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్డు దాటాలనుకునే పాదచారులు సురక్షితంగా వేచి ఉండేందుకు పలు కీలక కూడళ్లలో అత్యాధునిక ‘సిటిజన్‌ పెవిలియన్స్‌’ నిర్మించారు. అవకాశమున్న చోట్ల స్పష్టమైన జీబ్రాక్రాసింగ్స్‌, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు బ్లింకర్లు, రేడియం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.


అదనంగా 35 సీసీ కెమెరాలు

కేబీఆర్‌ పరిసరాల్లో అణువణువునూ పర్యవేక్షించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానంగా ప్రత్యేక నెట్‌వర్క్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న కెమెరాలకు తోడుగా అదనంగా మరో 35 హై- రెజల్యూషన్‌ సీసీ కెమెరాలను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.


city1.jpgనాలుగు షిఫ్టుల్లో పహారా...

కొత్త విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహనదారుల్లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ట్రాఫిక్‌ పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. 24 గంటల పర్యవేక్షణ కోసం సిబ్బందిని 4 షిఫ్టులుగా విభజించారు. ప్రతి కూడలి, ప్రధాన మలుపు వద్ద ట్రాఫిక్‌ వార్డెన్లు, పోలీసులు నిలబడి వాహనదారులకు రూట్‌ మ్యాప్‌లపై అవగాహన కల్పిస్తారు. మొబైల్‌ పెట్రోలింగ్‌ బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతాయి. వాహనదారులు, పాదచారుల అనుభవాలు, సలహాలు నేరుగా తెలుసుకునేందుకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. పార్క్‌ పరిసరాల్లోని బోర్డులపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను పంచుకోవచ్చు.


ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

  • ఎన్‌ఎఫ్ సీఎల్‌ నుంచి కేబీఆర్‌ పార్కు ప్రవేశ ద్వారం మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఎడమ మలుపు తీసుకుని బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా, అగ్రసేన్‌ ఐలాండ్‌, అపోలో ఎక్స్‌ రోడ్‌, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45 మీదుగా చెకోపోస్టుకు చేరుకోవాలి.

  • యూసుఫ్ గూడ, శ్రీనగర్‌ కాలనీ నుంచి రోడ్‌ నంబర్‌ 36, 45, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ ఇందిరానగర్‌, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 5, వెంకటగిరి జంక్షన్‌ వద్ద కుడి మలుపు తీసుకొని డైమండ్‌ హౌస్‌ ద్వారా రోడ్‌ నంబర్‌ 10, జూబ్లీహిల్స్‌ వైపు కొనసాగాలి. ఆల్‌ కాజర్‌ వద్ద కుడివైపు తిరిగి రోడ్డు నంబరు 36 నీరూస్‌ మీదుగా మాదాపూర్‌ వెళ్లాలి.

  • జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి జర్నలిస్టు కాలనీ, ఫిలింనగర్‌కు నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఈ వాహనాలు కేబీఆర్‌ పార్కు చౌరస్తా, అగ్రసేన్‌ చౌరస్తా, ఫిలింనగర్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.


లైన్‌ చేంజింగ్‌ పాయింట్స్‌

1) బంజారాహిల్స్‌

టీఎస్‌ స్టడీ సర్కిల్‌

2) బీఆర్‌ఎస్‌ భవన్‌ వద్ద

3) ఒమేగా ఆసుపత్రి వద్ద

4) మాజీ మంత్రి జానారెడ్డి

నివాసం వద్ద

5) అపోలో సర్కిల్‌

6) తాజ్‌మహల్‌ హోటల్‌

7) ఫోనిక్స్‌ బిల్డింగ్‌,

8) రోడ్డు నంబరు 65

9) మంత్రి టవర్స్‌

10) క్రీ స్టోన్‌


ఎగ్జిట్‌ పాయింట్లు

1) బంజారాహిల్స్‌

రోడ్డు నంబరు 14

2) నందినగర్‌

3) రోడ్డు నెంబరు

10 జహీరానగర్‌

4) తెలంగాణ భవన్‌

వద్ద కొత్త రోడ్డు

5) అగ్రసేన్‌ చౌరస్తా

రోడ్డు నంబరు 12


6) ఒమేగా ఆసుపత్రి,

లోటస్‌ పాండ్‌

7) టీటీడీ దేవాలయం రోడ్డు

8) బీవీబీ జంక్షన్‌, ఫిలింనగర్‌

9) జర్నలిస్టు కాలనీ, జూబ్లీహిల్స్‌,

10) రోడ్డు నంబరు 45

11) రోడ్డు నంబరు 36,

పెద్దమ్మ తల్లి దేవాలయం

12) అన్నపూర్ణ స్టూడియో లేన్‌

13) ఎన్‌టీఆర్‌ భవన్‌ రోడ్డు


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

కూరగాయలు కాదు.. కాలకూట విషం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 07:50 AM