Share News

రేవంత్‌ ఇల్లు కూడా 22ఏలో!

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:58 AM

‘‘భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో వేయడం.. ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తామని డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని సర్కారుపై బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష...

రేవంత్‌ ఇల్లు కూడా 22ఏలో!

  • ఆయనకు సెగ తగలగానే హడావుడి

  • ముఖ్యమంత్రికి చురుకు తగిల్తేగానీ

  • సామాన్యుల బాధలు పట్టవా?

  • 22ఏను.. ప్రజల్ని దోచుకునే ఆయుధంగా

  • మార్చుకున్నారు: హరీశ్‌రావు ఆగ్రహం

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో వేయడం.. ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తామని డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని సర్కారుపై బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు ‘హంతకుడే సంతాపసభ పెట్టినట్టు’ ఉందని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన ఏకంగా ఎయిర్‌పోర్ట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చారని.. చివరకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇల్లు కూడా 22ఏ ప్రొహిబిషన్‌ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావుడి మొదలైందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్‌.. నీకు చురుకు తగిలితే కానీ సామాన్యుల బాధలు పట్టవా?’’ అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ల గోడు ఎవరు వినాలని నిలదీశారు. ఎవరి భూమి 22ఏలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు జరిగినపుడు తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించకుండా రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 22ఏ అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా మారిందని.. రెవెన్యూశాఖలో ఏ పని కావాలన్నా, 22ఏ నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్‌ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని హరీశ్‌ ఆరోపించారు. ‘‘అసలు ఈ ప్రాపర్టీలను 22ఏలో ఎవరు పెట్టారు? కమీషన్లు తీసుకుని ఎవరు తొలగిస్తున్నారు? దీనిపై తక్షణమే విచారణ జరగాలి’’ అని డిమాండ్‌ చేశారు. తమ ప్రాపర్టీ 22ఏలో ఉందన్న విషయం చాలామంది సామాన్యులకు తెలియడం లేదని.. తీరా రిజిస్ట్రేషన్‌ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత.. చివర్లో ‘‘మీ భూమి 22ఏలో ఉంద’’ని చెప్పి రిజిస్ట్రేషన్‌ ఆపేస్తున్నారని, కట్టిన చలాన్‌ డబ్బులు కూడా వాపస్‌ ఇవ్వకుండా ప్రజల సొమ్మును ప్రభుత్వం నిలువునా దోచుకుంటోందని దుయ్యబట్టారు. అర్బన్‌లాండ్‌ సీలింగ్‌ పరిధి నుంచి బయటపడి, క్లియర్‌ అయిన భూములను కూడా ఈ ప్రభుత్వం సీలింగ్‌ యాక్ట్‌ కింద 22ఏలో పెట్టడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు.


ఉద్దేశపూర్వకంగానే.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తెచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రతో, ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి ఖతం చేసిందని హరీశ్‌ విమర్శించారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశామని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని.. స్టే రాకముందే ఈ పథకాన్ని కాంగ్రెస్‌ సర్కారు పాతాళంలో బొంద పెట్టిందని ధ్వజమెత్తారు. కౌంటర్‌ దాఖలుకు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చినా కావాలనే కౌంటర్‌ వేయకుండా వదిలేశారన్నారు. అందుకే కోర్టు స్టే ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి, వాదించడానికి రోజుకు 50 లక్షల ఫీజుతో సుప్రీంకోర్టు లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రాను ప్రత్యేకంగా తెచ్చుకున్నారని.. అంత ఫీజు చెల్లించడానికి ముఖ్యమంత్రికి పైసలు ఎక్కడినుంచి వచ్చాయని నిలదీశారు. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులకు రోజుకు 50 లక్షలు కట్టే ప్రభుత్వానికి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆడబిడ్డల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కల్యాణ లక్ష్మి కేసును వాదించడానికి ఒక మంచి లాయర్‌ దొరకలేదా? అని నిలదీశారు. రైతు సంక్షేమాన్ని కూడా కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని.. ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి, పెంచి ఇచ్చానని అబద్థాలు చెప్పడం సీఎంకు తగదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలన అంటే కుటుంబ పాలన.. ఫోర్‌ బ్రదర్స్‌ పాలనగా మారిపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో రేవంత్‌ సొంత మనుషులకు మాత్రమే జస్టిస్‌ జరుగుతోందని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఇతర హెల్త్‌ స్కీంలు ఏవీ పటిష్టంగా అమలు చేయడంలేదని, ఉద్యోగులు, ఇతర వర్గాల వారికి సరైన వైద్యం అందట్లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పథకమైనా తెచ్చిందా అని ప్రశ్నించారు. పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. వాళ్లకు క్యాష్‌ లెస్‌ ట్రీట్మెంట్‌ బంద్‌ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుళ్లపేరుతో చిల్లర రాజకీయం..

దేవుడి దర్శనం కోసం తాను గుడికి వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా? అని ప్రశ్నించిన హరీశ్‌.. తన మీద బురదజల్లి, తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే కుట్రతో పూజల పేరిట డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. తాను అలాంటి పూజలు చేసినట్టు సీఎం దగ్గర ఆధారాలుంటే వెంటనే బయటపెట్టాలన్నారు. దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయం చేయడం రేవంత్‌రెడ్డికే తెలిసిన విద్య అని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 06:58 AM