Share News

ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటే ఊరుకోం.. రేవంత్ లెక్కలు తప్పంటూ కవిత విమర్శలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:47 PM

తెలంగాణలో ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటే ఒప్పుకోమని ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యావేత్తలతో చర్చలు జరపాలని తెలిపారు.

ఇంటర్ బోర్డు రద్దు చేస్తామంటే ఊరుకోం.. రేవంత్ లెక్కలు తప్పంటూ కవిత విమర్శలు
Kavitha

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలో ఇంటర్ బోర్డు రద్దు ప్రతిపాదనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఒంటెత్తు పోకడలతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే ఒప్పుకోమని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై మేధావులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యావేత్తలతో చర్చలు జరపాలని తెలిపారు. డ్రాప్ అవుట్స్ పేరుతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న లెక్కలు తప్పని చెప్పుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ను ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్‌గా భావించొద్దని హితవుపలికారు. ఇంటర్ బోర్డును రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకించటం లేదని.. కానీ ఈ మార్పు జరగాలంటే 3 నుంచి 10 ఏళ్ల సమయం ప్రాసెస్ జరగాలని తెలిపారు.


రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న విద్యావిధానంలో మార్పు చేస్తున్నప్పుడు కచ్చితంగా స్టేక్ హోల్డర్స్‌‌తో మాట్లాడాలని కవిత అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అడిగితే ఎదురుదాడి చేసే పరిస్థితిలో ఉందంటూ వ్యాఖ్యానించారు. పది తరగతి తర్వాత ఇంటర్‌కు వెళ్తున్న వారిలో 10లో ఆరుగురు మాత్రమే ఉంటున్నారని చెబుతున్నారని.. కానీ అది గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థుల లెక్కలు అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పూర్తిగా ఓవరాల్‌గా చూస్తే మాత్రం డ్రాప్ అవుట్స్ లెక్క 16 శాతంగానే ఉందని చెప్పుకొచ్చారు.


గవర్నమెంట్‌‌లో పదో తరగతి చదివిన విద్యార్థులు కూడా ఆ తర్వాత ప్రైవేట్‌లోనో, ఇతర కోర్సుల్లోనో చేరుతున్నారని కవిత అన్నారు. నిజానికి అలా జరిగితే కూడా గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉంటే అది ప్రభుత్వం తప్పే అని తెలిపారు. డ్రాప్ అవుట్లకు సంబంధించి చాలా కారణాలున్నాయని.. నీతి ఆయోగ్ కూడా చాలా కారణాలు చెప్పిందన్నారు. ముఖ్యంగా డబ్బులు లేకపోవటమే మొదటి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా గ్రామాల్లో బస్సు సౌకర్యం లేని పరిస్థితి కూడా కారణమే అని చెప్పుకొచ్చారు.


డ్రాప్ అవుట్లలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే ఉంటున్నారని.. ఈ పరిస్థితిని నివారించేందుకు గుజరాత్‌లో నమో లక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణ రక్షణ చీఫ్ అన్నారు. డైరెక్ట్‌గా డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థుల ఖాతాల్లోకే ఏటా రూ.928 కోట్లు జమ చేస్తున్నారని తెలిపారు. దీని కారణంగా అక్కడ డ్రాప్ అవుట్లలో 16 శాతం తగ్గిందన్నారు. తెలంగాణలో కూడా అలాంటి పథకాన్ని అమలు చేస్తే డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పది తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లే విద్యార్థుల్లో డ్రాప్ అవుట్లు ఎక్కువగా విద్యార్థినిలే ఉంటున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారని.. కానీ ఆయన లెక్కలు తప్పన్నారు. 10 నుంచి ఇంటర్‌కు వెళ్తున్న ఆడవాళ్ల సంఖ్య 77.4 శాతంగా ఉంటే మగవాళ్ల సంఖ్య 68.4 శాతంగా ఉందని తెలిపారు. అబ్బాయిలే 51 శాతం ఫెయిల్ అవుతున్నారని... గంజాయి తీసుకోవటం, చదువును నిర్లక్ష్యం చేయటం కారణంగా ఈ పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు.. ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్న కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 02:00 PM