రెండు తుపాన్లను ఎదుర్కొన్నాం.. ఈ తుపానుకు సన్నద్ధంగా ఉండాలి.. అధికారులతో హోంమంత్రి
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:28 AM
ఏపీకి అక్వాన్ తుపాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు సమీక్ష నిర్వహించారు.
అమరావతి, నవంబర్ 17: బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను బలపడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు(మంగళవారం) సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హైఅలర్ట్‌గా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయంత్రానికి తీవ్ర తుపానుగా, ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హోంమంత్రికి అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందన్ని చెప్పారు.
సమష్టి కృషితో ఇప్పటికే రెండు తుపాన్లను ఎదుర్కొన్నామని.. ఈ తుపానుకు కూడా సన్నద్ధంగా ఉండాలని అధికారులకు హోంమంత్రి సూచించారు. ప్రజలకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలన్నారు. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజులూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోతకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులకు సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కోస్తా తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి
Read Latest AP News And Telugu News