కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 10:05 AM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులతో మాట్లాడారు.
అమరావతి, నవంబర్ 17: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు ఓఎన్జీసీ ప్రత్యేక సాంకేతిక బృందాలతో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులను తక్షణం సంప్రదించాలని అధికారులకు సూచనలు చేశారు. ఓఎన్జీసీ ఛైర్మన్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులతో చర్చించి భద్రతా చర్యలపై సమీక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం నగరం గ్రామ పరిధిలోని తాడివారిమెరక వద్ద ఓఎన్జీసీ గ్యాస్ డ్రిల్లింగ్ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజీ అవుతోంది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గ్యాస్ వెలువడింది. భారీ ఎత్తున గ్యాస్ పైకి ఎగసిపడుతోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. గ్యాస్ బావి చుట్టూ కిలోమీటరు పరిధిలోని నివాస ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. ఇప్పటివరకు ఎలాంటి మంటలు చెలరేగలేదని.. గ్యాస్ బావి ముఖద్వారం పటిష్ఠంగా ఉందన్న ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
భూమికి సమీపంలో గ్యాస్ వ్యాపించకుండా ఓఎన్జీసీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద నివారణలో భాగంగా డీజిల్ జనరేటర్లు, ఇతర పరికరాలను నిలిపివేసి సమీప ప్రాంతాల నుంచి తరలించారు. గ్యాస్ బావి లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంటోంది. మరో 4-5 గంటల్లో గ్యాస్ లీకేజీ ఘటనను పూర్తిగా నియంత్రించగలమని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News