ఏడుకోట్ల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:55 AM
జనసేన రాష్ట్ర కార్యాలయం పేరుతో నిరుద్యోగులను మోసం చేసి, ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
జనసేన నేతలపై నిందితురాలి ఆరోపణలు
ఉద్యోగాల పేరిట 7 కోట్లు వసూలు
మంగళగిరి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జనసేన రాష్ట్ర కార్యాలయం పేరుతో నిరుద్యోగులను మోసం చేసి, ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న బోడపాటి ధరణి కృష్ణ అలియాస్ గగర ధరణి పోలీసులు, జనసేన నేతలపై ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తణుకుకు చెందిన ధరణి కృష్ణ గత కొంతకాలంగా తాడేపల్లి ప్రాంతంలో నివాసం ఉంటోంది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పీఏగా వ్యవహరిస్తున్న కోట రుక్ష్మిణికి చెందిన కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో గతంలో ఆమె హెచ్‌ఆర్‌గా పనిచేసేదని అంటున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే)ను ఆమె తన బాబాయ్‌గా చెప్పుకొంటూ ఆయన పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలను సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, నకిలీ ఐడీ కార్డులను సృష్టించి ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, తుని ప్రాంతాలకు చెందిన సుమారు 35 మంది నిరుద్యోగుల నుంచి రూ.ఏడు కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధితుల్లో ఏలూరుకు చెందిన తరుణ్ నేరుగా శివ శ్రీనివాసరావును కలవడంతో ఈ వ్యవహారం బయటపడిందని అంటున్నారు. దీంతో ఈ నెల 11న మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో శివ శ్రీనివాసరావు, కోట రుక్ష్మిణి కలిసి వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 14న ధరణిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం మంగళగిరికి తరలించారు.
ఆమె తల్లి గగర నాగమణి తన కూతురు ఆచూకీ తెలియడం లేదంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విడుదల అనంతరం ధరణి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. శివ శ్రీనివాసరావు తనను చంపేస్తానంటూ బెదిరించారని, పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించింది. డబ్బు వసూళ్లన్నీ కోట రుక్ష్మిణి ఆదేశాలతోనే జరిగాయని ఆరోపించింది. ధరణి చేసిన ఆరోపణలను మంగళగిరి డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు ఖండించారు. ఉద్యోగాల పేరిట ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో బోడపాటి ధరణికృష్ణ, నిమ్మకాయల పెద్దిరాజులపై రెండు కేసులను నమోదు చేశామన్నారు.