ప్రేమ పేరుతో మోసం.. ఇన్‌స్టాగ్రామ్ ముఠా బండారం బట్టబయలు
ABN , Publish Date - May 02 , 2026 | 10:34 AM
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను, ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో ట్రాప్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అర్జున్, అతని సోదరుడు రాజీవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, మే2 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను, ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో ట్రాప్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అర్జున్, అతని సోదరుడు రాజీవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో అర్జున్, రాజీవ్‌ను ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ప్రొఫైల్‌ను మెయింటెన్ చేస్తూ అమ్మాయిలను బుట్టలో వేసుకోవడం నిందితుల ప్లాన్ పని పోలీసులు చెప్పారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మోసాల్లో రాజీవ్ క్రియాశీలకంగా వ్యవహరించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న రాజీవ్‌ను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బెంగళూరులో పట్టుకున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం ట్రాప్..
నిందితులు యువతులను ట్రాప్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించేవారని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులు, విలాసవంతమైన హోటల్స్‌లో దిగిన రీల్స్, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారని అన్నారు. తాము కూడా పెద్ద ధనవంతులమని యువతులను నమ్మించేవారని చెప్పారు. హైదరాబాద్‌లోని విలాసవంతమైన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో నివసించే సంపన్న కుటుంబాల పిల్లలను ఈ నిందితులు ప్రధానంగా లక్ష్యంగా చేసుకునేవారని వెల్లడించారు. అమ్మాయిలను పరిచయం చేసుకున్న కొద్దిరోజులకే ప్రేమ నటిస్తూ, పెళ్లి చేసుకుంటామని నమ్మబలికేవారని అన్నారు. యువతుల నమ్మకాన్ని పొందిన తర్వాత అసలు పని మొదలుపెట్టేవారని తెలిపారు.
బ్లాక్‌మెయిలింగ్..
సాన్నిహిత్యం పెరిగిన తర్వాత అమ్మాయిల వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి, వాటిని అడ్డం పెట్టుకుని భయపెట్టడం, అత్యవసరాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు వెల్లడించారు. నిందితులు దాదాపు 10 మందికి పైగా యువతులను ఇదే తరహాలో ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను కూడా ప్రేమ పేరుతో వేధించి, బ్లాక్‌మెయిల్ చేస్తూ సుమారు రూ. 13 లక్షల నగదును వసూల్ చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడు అర్జున్‌పై కేవలం జూబ్లీహిల్స్‌లోనే కాకుండా, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని అన్నారు.
పోలీసుల చర్యలు..
నిందితులను సమగ్రంగా విచారించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. వీరు ఇంకా ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు?, ఈ ముఠాలో ఇంకా ఎవరైనా సభ్యులు ఉన్నారా?, వీరు వసూలు చేసిన సొమ్మును ఏం చేశారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజీవ్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించి, అర్జున్‌తో కలిపి విచారించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా: సీఎం రేవంత్‌రెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం
Read Latest Telangana News And AP News And International News And Telugu News