Share News

Drug case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

ABN , Publish Date - Jan 03 , 2026 | 04:47 PM

భాగ్యనగరంలోని నానక్‌రామ్‌గూడలో ఈగల్ టీమ్‌ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.

Drug case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
MLA Adinarayana Reddy Son

హైదరాబాద్, జనవరి3 (ఆంధ్రజ్యోతి):భాగ్యనగరంలోని నానక్‌రామ్‌గూడలో ఇవాళ(శనివారం) ఈగల్ టీమ్‌ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (MLA Adinarayana Reddy) కుమారుడు సుధీర్‌రెడ్డి (Sudheer Reddy) డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.


ఈ పరిశీలనలో సుధీర్‌‌రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయనని అరెస్ట్ చేసి, డీ-అడిక్షన్ సెంటర్‌కి తరలించారు. సుధీర్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సుధీర్‌రెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆయనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుధీర్‌‌రెడ్డి డ్రగ్స్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


కాగా, సుధీర్‌రెడ్డి గత కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఈగల్ టీమ్‌కి వచ్చిన ఫోన్ కాల్‌తో సుధీర్‌రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరు స్నేహితులని అరెస్ట్ చేశారు. సుధీర్‌రెడ్డికి మాత్రమే గంజాయి పాజిటివ్, మిగిలిన ఇద్దరు స్నేహితులకు నెగిటివ్‌గా నిర్ధారించారు. సుధీర్‌రెడ్డిని డీ అడిక్షన్ సెంటర్‌కి తరలించారు. సోదాల సమయంలో డ్రగ్స్, గంజాయి దొరకలేదని ఈగల్ టీమ్ అధికారులు చెబుతున్నారు. డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్‌కి సుధీర్‌రెడ్డి అలవాటు పడినట్లు తెలిపారు. సుధీర్‌రెడ్డి ఈ కేసులో పట్టుబడిన తర్వాత కుటుంబ సభ్యులకు ఈగల్ టీమ్ అధికారులు సమాచారం ఇచ్చారు.


ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో రాజకీయ కుటుంబ సభ్యుల డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు బయటకు రావడంతో యువతపై ప్రభావం చూపించే డ్రగ్స్‌ను అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణలో అభివృద్ధి జాడేది.. కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 05:39 PM